Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా, యువజన సంఘాల నిరసన
- సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంతో దర్యాప్తు జరపాలి : మహిళా సంఘాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా రెజ్లర్ల పై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపాయి. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, పీఓడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షులు వి. సంధ్య, చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ పి. జ్యోతి, పీఓడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షులు డి.స్వరూప, ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఎన్. జ్యోతి మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడల్లో తలపడి వివిధ పథకాలు సాధించి, దేశానికి కీర్తి తెచ్చిన మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు బీజేపీ ఎంపీ పాల్పడితే, నెల రోజుల నుంచి దీనిపై ఆందోళన జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు నోరుమెదపటం లేదని ప్రశ్నించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రెజ్లర్లపై లైంగిక వేధింపు ఘటనపై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. బ్రిజ్‌భూషణ్‌ను రాజకీయ, ప్రభుత్వ పదవుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మేరీకోమ్ నివేదికను ఎందుకు బహిర్గతం చేయటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. పేద మహిళా క్రీడాకారులను ప్రోత్సహించి, వారికి శిక్షణ కోసం సురక్షితమైన పరిస్థితులను ప్రభుత్వం కల్పించాల్సిన అవసముందన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, పీవైౖఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యస్ ప్రదీప్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంధర్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి, ఉపాధ్యక్షులు ఆశాలత, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు పోటు కళావతి, పీఓడబ్ల్యూ నాయకులు వరలక్ష్మి, లక్ష్మిబాయి, సరళ తదితరులు పాల్గొన్నారు.