Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్‌కు టెక్నాలజీని అనుసంధానించాలి: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వ్యవసాయ రంగంలో శాస్త్ర పరిశోధనలు పెరగాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వృద్ధి చెందుతున్న సాంకేతికతను మార్కెట్‌కు అనుసంధానిస్తే, అద్భుత ఆవిష్కరణలు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన విస్తరణ విద్యాసంస్థ(ఈఈఐ) ఆడిటోరియాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలో వ్యవసాయరంగం దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగిందనీ, దీనివెనుక శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని చెప్పారు. పెరుగుతున్న జనాభా అవసరాలని తీర్చడానికి ప్రణాళికలు రూపొందించాలనీ, పరిశోధనా ఫలాల్ని మారుమూల ప్రాంతాల్లోని సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. పంటల ఉత్పత్తి, ఉత్పాదకతల్ని పెంచేందుకు, నష్టాల్ని తగ్గించేందుకు, మార్కెట్ అనుసంధానానికిి టెక్నాలజీలని వినియోగించాలన్నారు. దానికోసం రైతాంగానికి శిక్షణ ఇవ్వాలన్నారు. సేంద్రియ, సహజ వ్యవసాయ విధానాలకి కేంద్రం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిరంతరం ఉచిత విద్యుత్తు, రైతుబంధు, ఏఈవోల నియామకం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వ్యవసాయరంగానికి కేంద్రం సాయం చేయాలని కోరారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా నూతన వంగడాలని రూపొందించాలని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా, యూనివర్సిటీ ఇంచార్జి వైస్ చాన్సలర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎమ్ రఘునందన్‌రావు, డైరెక్టర్ డాక్టర్ సుధారాణి, రిజిస్ట్రార్ ఎస్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జీ-20 ఏర్పాట్లు పూర్తిచేయండి
హైదరాబాద్‌లో జూన్ 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే జీ-20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధికారుల్ని ఆదేశించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారంనాడాయన మాదాపూర్ హెచ్ఐసీసీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. జీ20 సదస్సు ద్వారా తెలంగాణతో పాటు, భారత విశిష్టతను చాటి చెప్పేందుకు కేంద్రంతో కలిసి పనిచేయాలని కేంద్రమంత్రి రాష్ట్ర మంత్రికి సూచించారు. ఈ సందర్భంగా జీ-20 అంతర్జాతీయ సదస్సును తాము ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. పూర్తి సహాయ సహకారాలు అంది స్తామన్నారు. ఈ సదస్సులో పోషక ఆహార భద్రత, వాతావరణ మార్పుల ప్రభావంపై జీ-20 సభ్య దేశాలు చర్చిస్తాయనీ, దానిలో తాము భాగస్వాములం అవుతామని వివరించారు. సమీక్షా సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, రాష్ట్ర అడిషనల్ డీజీ శ్రీమతి అభిలాష్ బిస్త్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.