Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటక ఫలితాలపై ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
- 'ఉపాధి', ప్రజాపంపిణీ వ్యవస్థ మెరుగు కోసం దేశవ్యాప్త ఉద్యమం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కర్నాటక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు కార్పొరేట్, కమ్యూనల్ శక్తులకు పెద్ద గుణపాఠం అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా అధోగతి పాలు కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలనీ, ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఉద్యమం చేయబోతున్నట్టు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య అధ్యక్షతన ఆ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రూ300 కే వంట గ్యాస్ బండ, మహిళలకు 2000 రూపాయల పింఛన్, ప్రజా పంపిణీ వ్యవస్థను బలపరచడం, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడం, నిరుద్యోగ భృతి కల్పన వంటి వాటికి ప్రజలు ఆమోదం తెలిపారని చెప్పారు. ఈ దేశానికి ప్రత్యామ్నాయ విధానాలు తప్ప కార్పొరేట్ విధానాలు కాదని కన్నడ ప్రజలు తేల్చిచెప్పారన్నారు. కర్నాటకలో కొత్తగా ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టి లాభ పడాలని చూసిన బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ప్రజలను కులం, మతం పేరుతో విడగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకోవడం ప్రజాస్వామ్యం వ్యవస్థలో సాధ్యం కాదని ఈ ఫలితాల ద్వారా స్పష్టమైందన్నారు. కర్ణాటక ప్రజల తీర్పు ప్రజాస్వామ్య శక్తులకు , బీజేపీయేతర ప్రభుత్వాలకు గొప్ప ఊపు ఇచ్చిందని అన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, బి.పద్మ, మచ్చా వెంకటేశ్వర్లు, నారి ఐలయ్య, పొన్నం వెంకటేశ్వరరావు రాష్ట్ర సహాయ కార్యదర్శులు వీరన్న, కందుకూరి జగన్, రాళ్ల బండి శశిధర్, మేకల ఆంజనేయులు, ములకలపల్లి రాములు ఎం వెంకటయ్య పాల్గొన్నారు.