Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐలాపురం, ఐలాపురం తండాలో వెయ్యి ఇండ్ల కూల్చివేత
- కొనుక్కున్న స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలు
- ఇంటి నెంబర్ ఇచ్చి పన్ను వసూలు చేసిన గ్రామ పంచాయతీలు
- ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలేసి ఇంటికి మీటర్లు పెట్టిన విద్యుత్ శాఖ
- అసైన్డ్ భూమైతే.. అనుమతులెట్లా ఇచ్చారని బాధితుల ప్రశ్న..
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
వారంతా పేదలు.. కయాకష్టం చేసి దాచుకున్న డబ్బుతో ఇంటి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు.. వారికి గ్రామ పంచాయతీ ఇంటి నెంబర్లు ఇచ్చింది.. ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నారు. విద్యుత్ శాఖ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలేసింది. దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఇంటి మీటర్లు ఇచ్చారు. కాలనీల్లో రోడ్లు వేశారు. గుడి నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన చేశారు. అసైన్డ్ భూమిని వెంచర్లు చేసి ప్లాట్లు అమ్మే సంగతి పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, వీఆర్ఏలకే కాదు సర్పంచ్, రెవెన్యూ అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యే వరకు అందరికీ తెలుసు. ఎనిమిదేండ్లు కావస్తున్నా ఏనాడూ అడ్డుకోని అధికార యంత్రాంగం అర్థరాత్రి వచ్చి ఇండ్లను నేలమట్టం చేసింది. దాంతో ప్లాట్కొని ఇండ్లు కట్టుకున్న వేలాది మంది రోడ్డున పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం, ఐలాపురం తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 119లో సుమారు 1200 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గిరిజనులకు అప్పట్లో కొంత భూమిని అసైన్డ్ చేయగా.. వారు ఆ భూముల్ని సాగు చేసుకున్నారు. అమీన్పూర్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. మున్సిపాలిటీ పక్కనే ఐలాపురం, ఐలాపురం తండా గ్రామాలున్నాయి. అక్కడ గజం స్థలం ధర రూ.50 వేలపైనే ఉంది. గిరిజనులు తమకు అసైన్డ్ చేసిన భూముల్ని కుటుంబ ఆర్థిక అవసరాలు బాగలేక పిల్లల చదువులు, పెళ్లిండ్ల కోసం అమ్ముకున్నారు. వాటిని కొందరు రియల్టర్లు ప్లాట్లుగా చేసి విక్రయించారు. ఎనిమిదేండ్లుగా ఆ రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ప్లాట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. మొదట్లో గజం ధర రూ.2 వేలుండేది. ఇప్పుడు రూ.10 వేలైంది. ఎపీ, తెలంగాణకు చెందిన పలు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వలసలొచ్చి బతుకుతున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు, చిరువ్యాపారాలు చేసే వాళ్లు, కంపెనీలు, ఇండ్లల్లో పనిచేసే వాళ్లు అక్కడ ఇంటి స్థలం కొనుగోలు చేశారు. చాలా ఏండ్ల పాటు ఎవరూ అభ్యంతరం తెలపలేదు. దాంతో వారంతా స్వంత ఇండ్లను నిర్మించుకున్నారు. ఇండ్లు కట్టుకున్న వారిలో 60 శాతం మంది పాలమూరు ప్రాంతానికి చెందిన పేదలే ఉన్నారు.
చీకట్లో ఇండ్లు నేలమట్టం
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎ.శరత్ ఆదేశాల మేరకు అమీన్పూర్ తహసీల్దార్ దశరథతో పాటు మరో పది మంది తహసీల్దార్లు, పోలీసులు గత శనివారం రాత్రి జేసీబీ, ఇటాచీలను పెట్టి పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చి వేశారు. ఎలాంటి నోటీసులూ, ముందుస్తు సమాచారం ఇవ్వకుండానే ఇండ్లను కూల్చివేయడంతో నివాసముండే వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఐలాపురం రోడ్డు వైపున ఉన్న ఇండ్లన్నీ ప్రస్తుతం నేలమట్టమయ్యాయి. ఐలాపురం తండాలో ఇండ్లు కట్టుకున్న నిరుపేదల్లో. ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఆటో, క్యాబ్, ఇతర వాహన డ్రైవర్లు ఉన్నారు. వారి సొంత ఊర్లో ఉన్న భూములు ప్రాజెక్టు కింద ముంపునకు పోవడంతో ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం డబ్బులు తెచ్చి ప్లాట్లు కొని ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ల ఇండ్లను నేలమట్టం చేసే సరికి గుండెలవిసేలా రోధిస్తున్నారు.
ఎనిమిదేండ్లుగా అందరికీ తెలిసే జరుగుతుంది
ఐలాపురం, ఐలాపురం తండా గ్రామ పంచాయతీల్లో అసైన్డ్ భూముల్ని వెంచర్లు చేసి అమ్ముతున్న విషయం అందరికీ తెలుసు. స్థానిక గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, అధికార పార్టీ నాయకులు ముందుండి గిరిజన రైతుల భూముల్ని అమ్మిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. మధ్యవర్తులు రియల్టర్టుగా మారి వివిధ ప్రాంతాల నుంచి వలసొచ్చి బతుకుతున్న పేదలను నమ్మించి తక్కువ ధరకే ఇస్తున్నామంటూ కట్టబెట్టారు. పట్టా భూములు గజం ధర రూ.50 వేలు ఉండగా అసైన్డ్ భూముల్లో పది వేలకే వస్తుందన్న ఆశతో పేదలు కష్టపడి పోగేసుకున్న సొమ్ముతో ప్లాట్లు కొన్నారు. భూములు మావే అంటూ రైతులు, మేం అండగా ఉంటాం ఎవరూ రారని చెప్పి స్థానిక నాయకులను నమ్మించి ప్లాట్లను కట్టబెట్టారు. వీఆర్ఓ, వీఆర్ఎలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అసైన్డ్ భూముల అమ్మకాలు జరుగుతుంటే ఏనాడూ అడ్డుకోలేదు. సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే వరకు ప్రజా ప్రతినిధుల సహాకారంతోనే ప్లాట్ల క్రయవిక్రయాలు జరిగాయని వారు చెబుతున్నారు.
అసైన్డ్ భూమైతే అనుమతులెట్లిచ్చిండ్రు
అసైన్డ్ భూముల్లో ఇండ్లు కట్టుకోవడం నేరమని అధికారులు మా ఇండ్లు కూల్చివేశారు. అసైన్డ్ భూములైతే అనుమతులు ఎట్లా ఇచ్చారని బాధితులు నిలదీస్తున్నారు. ఎనిమిదేండ్లుగా ప్లాట్ల కొనుగోళ్లు జరుగుతున్నా పట్టించుకోలేదు. రెండు గ్రామ పంచాయతీల్లో అసైన్డ్ భూముల్లో కట్టుకున్న ఇండ్లకు గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నెంబర్ ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శి పంచాయతీ రికార్డుల్లో పేరు నమోదు చేశారు. అట్టి నెంబర్‌తో ఇంటి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. ఇల్లు కట్టుకుని కరెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే విద్యుత్ శాఖ అధికారులు ఐలాపురం తండాలో ట్రాన్స్ఫార్మర్ వేశారు. కరెంట్ స్థంబాలు నాటి విద్యుత్ లైన్ వేశారు. కాలనీలో రోడ్లు వేసిండ్రు.. అని వివరించారు.
59 జీవో కింద క్రమబద్దీకరణ చేయాలి: నర్సింహ, బాధితుడు, ఐలాపురం తండా
ప్రభుత్వం 59 జీవో కింద తమ ప్లాట్లను కూడా క్రమబద్దీకరణ చేయాలి. ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుంటే నామినల్ ఫీజుతో రెగ్యులర్ చేస్తున్న ప్రభుత్వం తమ ఇండ్లను మాత్రం ఎందుకు కూల్చి వేస్తుంది. నిరుపేదలమైన తాము తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తుంటే కొనుగోలు చేశాం. అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నం. అర్థరాత్రి వచ్చి కూలగొట్టి రోడ్డున పడేసిండ్రు. మాకు కోర్టు వివాదాలు తెల్వదు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలి. వందల కుటుంబాలు వీధిన పడ్డాయి. జీవితాంతం కష్టపడి పోగేసిన సొమ్ముతో కట్టిన ఇంటిని నేలపాలు చేసిండ్రు. మా కుటుంబాలు బతికేదెట్ల. అప్పుడే వద్దని చెబితే మేం కొనేవాళ్లం కాదు.
ఎటువంటి అనుమతుల్లేవు: దశరథ, తహసీల్దార్, అమీన్పూర్
ఐలాపూర్, తండా భూములు కోర్టు పరిధిలో ఉన్నాయి. అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేయడానికి వీల్లేదు. అక్రమ లేవుట్లలో ప్లాట్లు కొని ప్రజలు ఇబ్బంది పడొద్దు. వివాదాస్పద భూముల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేస్తే చర్యలు తీసుకుంటాం.
బాధితులకు న్యాయం చేయాలి: నర్సింహారెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
ఐలాపురం, ఐలాపురం తండాలోని అసైన్డ్ భూముల్లో ప్లాట్లుకొని ఇండ్లు కట్టుకున్న పేదలకు న్యాయం చేయాలి. అక్కడ ప్లాట్ల విక్రయాలు జరిగింది. ఇండ్ల్లు కట్టుకున్న విషయాలన్నీ అధికారులకు తెలుసు. ఎప్పటి నుంచో నిర్మాణాలు జరుగుతున్నా ఏనాడూ అడ్డుకోలేదు. పైగా ఇంటి నెంబర్, కరెంట్ మీటర్లు ఇచ్చిండ్రు. మధ్యవర్తుల మాటలు నమ్మి పేదలు ఇండ్లు కట్టుకున్నారు. వారి ఇండ్లను కూల్చివేయడం వల్ల లక్షల్లో నష్టపోయారు. వారందరికీ న్యాయం చేయాలి. ప్రభుత్వ భూముల కబ్జాలపై కఠినంగా ఉండటమంటే ఇండ్లు కట్టిన తర్వాత కూల్చివేయడం కాదు. ముందే భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలి. పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మరో పక్క కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడం అన్యాయం.