Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మమ్మల్ని ఎస్పీలుగా నియమిస్తే
- రాష్ట్రం మరో పంజాబేనా..!
- ఐపీఎస్ వాట్సాప్ వ్యాఖ్యలపై మండిపడుతున్న కొందరు నాన్‌కేడర్ ఎస్పీలు
- అలాంటి వ్యాఖ్యలు చేసిన అదనపు డీజీపై డీజీపీ సీరియస్?
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
మేము జిలాల ఎస్పీలుగా పని చేయడానికి అర్హులం కామా? మాకు ఆ సమర్థత లేదా? మాపై డైరెక్టు రిక్రూట్ ఐపీఎస్ అధికారులకు ఎందుకింత చిన్న చూపు అంటూ కొందరు నాన్ కేడర్ ఎస్పీలు, రేపో మాపో నాన్‌కేడర్ ఎస్పీలుగా పదోన్నతులు పొందనున్న కొందరు అదనపు ఎస్పీలు భగ్గుమంటున్నారు. ఐపీఎస్యేతర అధికారులను జిల్లాల ఎస్పీలుగా నియమించడం తగదని, దాని వల్ల రాష్ట్రం మరో పంజాబ్‌గా మారుతుందని ఐపీఎస్ అధికారుల వాట్సాప్‌గ్రూపులో ఒక అదనపు డీజీ స్థాయి అధికారి అభిప్రాయపడటం పోలీసుశాఖలో కలకలం రేపింది. తాజాగా నల్లగొండ జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డిని రాచకొండ కమిషనరేట్‌లో పాలనా విభాగం డీసీపీగా బదిలీ చేసి ఆయన స్థానంలో అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావును ఎస్పీగా సర్కారు నియమించింది. అలాగే సూర్యపేట్లో సీఐడీ లోని నాన్‌కేడర్ ఎస్పీ ప్రకాశ్జాదవ్ను ఎస్పీగా నియమించింది. అంతకు ముందు కొత్తగా 21 జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ కమిషనరేట్లు, మరి కొన్ని జిల్లాల్లో గ్రూప్‌వన్ ద్వారాపోలీసు శాఖలో రిక్రూటై ఎస్పీ స్థాయికి ఎదిగిన మరి కొందరు అధికారులకు బాధ్యతలను అప్పగించారు. అలాగే మరి కొందరు డీసీపీలు, ఎస్పీలు పోలీసు శాఖలో సబ్ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి వచ్చిన అధికారులకు అవకాశం లభించింది.
అయితే మొదటి నుంచి డైరెక్టు రిక్రూట్ ఐపీఎస్ అధికారులకు , ర్యాంక్ప్రమోటీ ఐపీఎస్ అధికారులకు మధ్య అగాధం ఉంది. పలు సందర్భాలలో ఐపీఎస్ అధికారులకంటే కింది స్థాయి నుంచి వచ్చిన అధికారుల అనుభవాలతోటే శాంతి భద్రతను చక్క దిద్దిన సందర్భాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. అయితే తాజాగా ఐపీఎస్‌ల వాట్సాప్ గ్రూపులో నాన్‌కేడర్ ఎస్పీల సమర్థతను శంకించేలా ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యలు కింది స్థాయి అధికారులలో వైరల్ అయ్యాయి. మీరు నేరుగా రిక్రూట్ అయిన ఐపీఎస్ అధికారులుగా మంచి పోస్టింగ్‌లను పొందడాన్ని మేము ఏ రోజు ప్రశ్నించలేదు, కాని మాకు అవకాశం వస్తే మీకెందుకంత జెలసీ అని కొందరు నాన్ కేడర్ ఎస్పీలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గతంలో డీఎస్పీ, ఎస్ఐ స్థాయి నుంచి పదోన్నతులు పొందిన పలువురు పోలీసు అధికారులు మతకలహాలు మొదలుకుని తీవ్రవాదం, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో కీలక పాత్ర వహించారని, చివరికి విధి నిర్వహణలో బలిదానాలు కూడా చేసిన వారున్నారని గుర్తు చేశారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలలో పలు కీలక పోస్టులలో నాన్ ఐపీఎస్ అధికారులనే నియమిస్తున్నారని, వారు కూడా మంచి ఫలితాలను సాధిస్తున్నారని మరో అదనపు ఎస్పీ స్థాయి అధికారి అన్నారు. మొత్తం మీద ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ విధంగా తమను కించపరిచేలా వాట్పాస్లో పెట్టడాన్ని అభ్యంతరం చెబుతు కొందరు అధికారులు డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిసింది.
అయితే అప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న డీజీపీ అనురాగ్‌శర్మ సీరియస్ అయ్యారని తెలిసింది. బాధ్యతా యుతమైన విధుల్లో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యానాలు ఎవ్వరు చేసినా తప్పేనని ఆయన నాన్ కేడర్ ఎస్పీలు కొందరితో అన్నట్టు తెలిసింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగాక ఐపీఎస్ అధికారుల కొరత ఉందని, మరో వైపు కొన్ని జిల్లాల్లో డైరెక్ట్ ఐపీఎస్‌లకు , మరి కొన్ని జిల్లాల్లో నాన్ ఐపీఎస్‌లకు ఎస్పీలుగా బాధ్యతలను అప్పగించడం అనేది గతం నుంచి అనుసరిస్తున్న విధానమేనని మరో సీరియర్ ఐపీఎస్ అధికారి అన్నారు. ఏది ఏమైనప్పటికీ నాయకశ్రేణిలోని పోలీసు ఉన్నతాధికారుల మధ్య ఇలాంటి వాతావరణం ఏర్పడటం సరికాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈ వివాదాన్ని ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం.