Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పోర్ట్స్‌కోటా మెడికల్ సీట్ల వ్యవహారం
- ఫైనల్ లిస్టుపై సాట్స్ డైరెక్టర్ సంతకం కూడా కరువు.?
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
స్పోర్ట్స్‌కోటాలో మెడికల్ సీట్ల కేటాయింపు వ్యవహారంలో మరో నిర్లక్ష్యం వెలుగుచూసింది. తుది ప్రాధాన్యత లిస్టు ప్రభుత్వ అనుమతి లేకుండానే కాలోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి చేరింది. చిత్రంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ(సాట్స్) డైరెక్టర్ సంతకం కూడా లేదని తెలుస్తోంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి, విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకున్న అధికారులపై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
2017-18 విద్యాసంవత్సరానికి సంబం ధించి స్పోర్ట్స్ కోటా మెడికల్ సీట్లలో అక్రమాలు జరిగిన తీరును 'నవతెలంగాణ' గత రెండు నెలలుగా వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీనికి స్పందించిన సాట్స్ అధికారులు ద్విసభ్య కమిటీ నియమించారు. ఆ కమిటీ తన నివేదికనూ అధికారులకు అందించింది. ఈ రిపోర్టు సరిగా లేదని ఇద్దరు సీనియర్ అధికారులతో మరో కమిటీని ప్రభుత్వం వేసింది. ఆ కమిటీ విచారణ చేసింది. మొదటి కమిటీ నివేదికలోనే తప్పు జరిగినట్టు పేర్కొన్నారు. వాస్తవానికి స్పోర్ట్స్ కోటా సీట్ల కేటాయింపుపై జీవోనెంబర్ 8 ప్రకారం ప్రభుత్వ కార్యదర్శి(స్పోర్ట్స్) చైర్మెన్‌గా, సాట్స్ ఎండీ కన్వీనర్‌గా ఏడుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ సాట్స్ ఉన్నతాధికారులు అదేదీ పట్టించుకోకుండా కేవలం డిప్యూటీ డైరెక్టర్లు, కోచ్‌లతో కూడిన కమిటీని వేసి సర్టిఫికేట్ల పరిశీలన చేశారు.
చివరికి ప్రభుత్వ కార్యదర్శి అనుమతి తీసుకోకుండానే తుది ప్రాధాన్యత లిస్టును కాలోజీ నారాయణరావు హెల్త్యూనివర్సిటీకి పంపించారు. కనీసం సాట్స్ ఎండీ సంతకం కూడా ఆ లిస్టుపై లేదని తెలుస్తోంది. స్పోర్ట్స్‌కోటాలో మెడికల్, ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి ఎలాంటి ఫైనల్ ప్రెయార్టీ లిస్టును సర్కారు ఆమోదించలేదని వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. భరత్‌చంద్రారెడ్డి అనే విద్యార్థి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ అధికారులు ఈ మేరకు సమాధానమిచ్చారు. అయితే ప్రాథమిక విచారణలోనే పొరపాటు జరిగినట్టు సర్టిఫికేట్లను పరిశీలించిన కమిటీ సభ్యులు ఒప్పుకున్నా, ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ తతంగంలో ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందనే వాదనలూ వినిపిస్తున్నాయి.