Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక దేశానికి అద్భుతమైన మానవ వనరు ఏదైనా ఉందంటే యువత. వినూత్నమైన ఆలోచనలతో దేశాన్ని ముందుకు నడిపించ గల సత్తా వారి సొంతం. యువ జనాభా కలిగిన దేశమే సత్వర అభివృద్ధి సాధిస్తుందనేది వాస్తవం. ఎందుకంటే యువత సమస్యలతో పోరాడగలదు. చీకటిని జయించగలదు. అధికారాన్ని మార్చగలదు.విప్లవాలు తేగలదు. ఒకప్పుడు 'నేటి విద్యార్థులే రేపటి పౌరులు' అన్నారు. కానీ ఇప్పుడు వారే దేశ భవిష్యత్తు నిర్మాతలు. నూతన ఆవిష్కర్తలు, సృష్టికర్తలు. నవసమాజ సాధకులు. దేశ సంపదను పెద్దమొత్తంలో సృష్టించేది వారే.అందుకే దేశ గతిని,స్థితిని మార్చే శక్తిలో వారే కీలకం. అలా చాలా దేశాలు మారిన సంఘటనలూ చరిత్రపుటల్లో అనేకం.అమెరికా, ఫ్రాన్స్, చైనా, రష్యా లాంటి దేశాల్లో విప్లవాలు వికసించడానికి యువతే ప్రధానం.యువశక్తి అనేది అణుశక్తి కంటే బలమైనది. దానిని సరైన రీతిలో ఉపయోగించుకోగలిగితే అభివృద్ధి పరుగులు పెడుతుంది. దేశ కీర్తి నలుదిశలా చాటే అవకాశం కలుగుతుంది. అయితే వీరిలోనే తమలో నిబిడీకృతం అయి ఉన్న సామర్థ్యం తెలియని వారు కూడా అనేకులు. ముందుగా వారిలో అంతర్గ తంగా ఉన్న చైతన్యాన్ని వెలికి తీయగలిగే పరిస్ధితులు సమాజం కలుగ చేయాలి.స్ఫూర్తిని అందించాలి. దిశా నిర్దేశం చేయగలగాలి. దేశానికి యువ జనాభా ఉండటం వరమే కానీ వారిని సరైన రీతిలో ఉపయోగించుకున్న నాడే సరైన ఫలితాలు చూడగలం. దాన్ని ఆచరించాలంటే యువతలో కొంత అభద్రత, భయం పోవాలి. ఆలోచనాశక్తి పెరగాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. సమాజ మార్పునకు నాంది పలకాలి. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ముందుకు సాగాలి. నేటి యువత మంచిచెడు నిర్ణయించుకోవడానికి జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం ఒక వేదిక కావాలి. నేషనల్ యూత్ డేను పురస్కరించుకుని 'సోపతి' కవర్ పేజీ కథనం..
ఒక దేశ ఆర్థికాభివృద్ధి అనేది ఆదేశంలో సహజ వనరులపైనే కాదు అక్కడ నెలకొన్న మానవ వనరులపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. మానవ వనరులంటే జనాభా. ఈ జనాభాలో విభిన్న వయోవర్గాల వారు ఉంటారు. వీరిలో ఉత్పాదకవర్గమైన యువ జనాభా కీలక పాత్ర వహిస్తుంది. ప్రపంచంలోనే అద్భుతమైన సహజ వనరులు మానవ వనరులున్న దేశం మనది. అంతకన్నా ముఖ్యంగా దేశ జనాభాలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశం. నేడు ప్రపంచంలో అభివృద్ధి విషయంలో అగ్రగామిగా ఉన్న దేశాలు కూడా ఆ దేశాల వయోవిభజనలో వృద్ధుల జనాభా పెరగడం చూసి కలవరపడుతున్నాయి. రానురానూ దేశంలో అనుత్పాదక జనాభా పెరుగుతూ ఉండటంతో ఆ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఈ విషయంలో అలాంటి పరిస్ధితి మన దేశానికి లేదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. కానీ ఆ యువతను ప్రభుత్వాలు సరిగ్గా వినియోగించుకుంటున్నాయా? వారి నైపుణ్యం వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయా? అనేది ఇక్కడ కీలకంగా గుర్తించాల్సిన అంశం.
ఆలోచనా దృక్పథం
మనం ఏం ఆలోచిస్తామో ఆ విధంగానే తయారవుతాం. అందుకే మన ఆలోచనలు ధోరణిని ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. అంటే మనకు మనమే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మాటలు అనేవి తాత్కాలికమే. ఆలోచనలు మాత్రం శాశ్వతం. అవి చాలా దూరం ప్రయాణిస్తాయి. ఆలోచనలు సానుకూలంగా ఉంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అదే ప్రతికూలంగా ఉంటే ప్రతికూల ఫలితాలే వస్తాయి. సానుకూల ఆలోచనలు మన హృదయాలలో ఆశను సృష్టిస్తాయి. అయితే భయం, కోపం, అసూయ, అహం వంటి ప్రతికూల భావాలు మన మనస్సులలో ఆందోళనను కలిగిస్తాయి. బాల్యంలో ఈ సానుకూలతకు ప్రతికూలతకు మధ్య పెద్ద బేధం తెలియదు.వృద్దాప్యంలో వైరాగ్యం దిశగా జీవితం నడక సాగిస్తుంది. కానీ యవ్వనంలో సానుకూల ఆలోచనలు యువతకు ఆయుధం కావాలి. ప్రతికూల ఆలోచనలు మూఢ నమ్మకాలు పట్ల ఆకర్షితులయ్యే యువత ఉన్న దేశం ఎన్నటికీ పురోగతి సాధించలేదు. జీవితంలో సానుకూల ఆలోచనలు ఉండాలి. ఈ ఆలోచనలు వ్యక్తిగతంగా యువతకే కాదు దేశానికి ఎంతో ప్రయోజనకరం. రాబోయే తరానికి వార సత్వంగా అందించే గొప్ప బహుమానం.నేటి యువతకు కళాశాల ల్లోనూ కార్యరంగంలోనూఎన్నో సమస్యలు, సవాళ్ళు ఎదురవుతు న్నాయి. వాటిని సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కోవడానికి సానుకూలమైన ఆలోచన, సానుకూల భావాలు అత్యంత ఆవశ్యకం. ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథం లేకపోతే యువత విజయాన్ని సొంతం చేసుకోలేదు. జీవిత లక్ష్యాన్ని సాధించలేదు. జీవన యాత్రను అర్ధవంతంగా మలచుకోలేదు. అందుకే యువత ఆలోచనా దృక్పథం మారాలి.
కంపర్ట్ జోన్ ప్రగతికి అవరోధం
భద్రమైన జీవితాన్ని కోరుకునే వారు భవ్యమైన చరిత్రను మిగల్చలేరు. బతుకు సఫలం, సార్థకం కావాలంటే సవాళ్లకు సిద్ధమై ఉండాలి. నేటి యువతలో చాలా మంది వారిలో అంతర్గతంగా ప్రతిభా పాటవాలు ఉన్నప్పటికీ వాటిని మెరుగు పెట్టే దిశగా పరిశ్రమించడానికి కృషి చేయకుండా ఈ కంఫర్ట్ జోన్ లోనే ఉండి పోతున్నారు.ప్రశాంత జీవనం సాగించాలి అంటే రిస్క్ కు దూరంగా ఉండాలి సవాళ్ళను స్వీకరించకుండా కంఫర్ట్‌గా జీవించాలి అనే దృక్పధం కలిగిన యువత దేశానికి తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తుంది. ఉరుకులు పరుగులు పెట్టి సాధించేది ఏముంది జీవితాన్ని ఆస్వాదించాలి అంటూ యుక్త వయసులో ఒత్తిడులకు దూరంగా అనుభవిద్దాం అనే ధోరణి కలిగిన యువత నేటి సమాజంలో లేకపోలేదు. బద్దకానికి మరో పేరుగా చెప్పుకునే అనుభవిద్దాం అనే కంపర్ట్ జోన్ అనే పేరు పెట్టి తనను తాను మోసం చేసుకుంటూ వ్యవస్ధకు పరోక్షంగా హాని చేసే ప్రక్రియ నేడు కొంతమంది యువతలో కనిపిస్తూ ఉంది. ఇటువంటి వారికి జీవితంలో చిన్న సవాలు ఎదురైనా తట్టుకోలేరు. ఈ ధోరణి వీళ్లకే పరిమితం కాకుండా అది మరింత వ్యాప్తి చెందింతే యువతలో ఉద్యమిత్వ లక్షణాలు క్షీణించిపోతాయి. ఉద్యమిత్వం లోపించిన దేశం తీవ్రంగా నష్టపోతుంది. అందుకే పెద్దలు 'జీవితంలో రిస్క్ తీసుకో... గెలిస్తే విజేత అవుతావు. ఓడితే ఆ అనుభవంతో దారి చూపగలుగుతావు' అన్నారు.
సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం
ఓటమిని జీర్ణించుకోలేక చిన్న చిన్న పరాజయాలకే నిరాశకు గురై కృంగిపోయే యువతను నేడు అనేకమందిని చూస్తున్నాం. కొందరైతే ఓడిపోతాం అనే భయంతోనే ప్రయత్నించడం మానేస్తున్నారు. కొందరైతే లక్ష్యాన్ని మాత్రమే చూస్తూ ఆ భావాన్ని ఆస్వాదిస్తూ లక్ష్య సాధనలో మాత్రం దృష్టి పెట్టలేని వాళ్ళు ఉన్నారు. పోరాడుతూ మరణిస్తే గెలిచినట్లే.. పోరాడుతూ విరమిస్తే మరణించినట్లే అన్నారు పెద్దలు. ఇది అక్షర సత్యం. మనలో పేరుకు పోయిన భీతి మనలో అంతర్గతంగా నెలకొన్న ప్రతిభను నిర్వీర్యం చేస్తుంది. ఫలితం ఏమిటి అనేది పట్టించు కోకుండా పోరాటంలో దిగిన వారు విజేతలవుతున్నారు. ఒక వేళ ఓటమి ఎదురైనా దానిని అనుభవంగా తీసుకుని పోరాటం కొనసాగిస్తున్న వారు విజయాన్ని ఒడిసి పట్టుకుంటున్నారు. విజయాన్ని అందుకునే ముందు సహజంగా ఓటములు వెక్కిరి స్తూనే ఉంటాయి. ఆ ఓటముల నుంచే పాఠాలు నేర్చుకోవాలి. అనుకున్నది సాధించే లక్ష్యంలో ప్రతి ఓటమిని గెలుపునకు మెట్లుగా మలుచుకోవాలి. అందుకే ఓటమి కూడా గెలుపుగా చూసినప్పుడే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. మొదటి ప్రయత్నంలో గెలిచిన వారు కన్నా ఓడి గెలిచిన వారు ఆ విజయాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారు. అటువంటి వాళ్ళు మరెందరికో మార్గదర్శకంగా నిలుస్తారు. నేడు దేశంలో కుంగుబాటు వల్లనే అనేక మంది యువత చిన్న చిన్న కారణాలకు కూడా ప్రాణాలను తీసుకుంటున్నారు.ఈ రోజు అత్యున్నత స్ధితిలో ఉన్న వాళ్ళు ఎన్నో వైఫల్యాలను ఎదురు చూసిన వారే.వైఫల్యాలు ఇచ్చిన అనుభవాలే ఎప్పటికి పటిష్టమైన భవిష్యత్ అందిస్తాయి.
ఆత్మవిశ్వాసం
ఉన్నత విద్యావంతులు అయిన యువత కూడా తన పట్ల తనకు విశ్వాసం సన్నగిల్లి భగవంతునిపై భారం వేసి కార్యాచరణను కొనసాగించే వారు లేకపోలేదు. ఇటువంటి వారు మేము ఆస్తికులమని సమర్ధించుకుంటారు. అయితే ఈ తరహా నైజాన్ని ఏనాడో గుర్తించిన వివేకానంద. తనపై తనకు నమ్మకం లేని వాడు ఆస్తికుడు కాదని నాస్తికుడని తనపై తనకు నమ్మకం ఉన్నవాడే ఆస్తికుడని పేర్కొన్నారు. ఆత్మ విశ్వాసం సడలిన యువత దేశంలో ఎంత ఉన్నప్పటికి అది నిష్ప్రయోజనమే. ఆత్మ విశ్వాసం సాధించాలి అంటే ప్రతి మనిషి తనకంటూ ఓ లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్య సాధన దిశగా నిరంతరం సాధన చేయాలి. లక్ష్యం భారీగా పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటే ఉపయోగం లేదు. అనుకున్న లక్ష్య సాధనలో అనేక వైఫల్యాలు వస్తాయి. కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు అని జాతిని మేలుకొలిపే సందేశం ఇచ్చారు. ప్రధానంగా యువ తరంలో ఆత్మన్యూనతా భావాలను రూపుమాపి వారిలో ఆత్మ విశ్వాసాన్ని పొదుగొల్పి దిశా నిర్దేశం చేయగలిగిన నాడు యువత దేశానికి కీలకంగా మారుతుంది. అటువంటి వాతావరణాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వాలు కలుగ చేయాలి.
కేరీర్‌పై దృష్టి
నేటి ప్రపంచ యువత కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. టీనేజ్లోనే ఏ రంగంలో స్థిరపడాలి అనేది ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రుల ఆలోచన కూడా ఇదే. పిల్లలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అయితే వారిలో ఏ కొద్దిమంది మాత్రమే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలా అనుకున్న కెరీర్లో స్థిరపడిన యువత డాలర్ల వేటలో పరాయి దేశానికి వలసపోతున్నారు. అయితే అధిక శాతం యువత అటువంటి మెరుగైన ఉపాధి అవకాశాలను అందుకోలేక పోతున్నారు. కారణం ఆయా రంగాల్లో నైపుణ్యాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవటం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహం కలిగిన యువతీయువకులు ఎందరో ఉన్నారు. వారిలో అధిక శాతం ఆర్ధికంగా తక్కువగా ఉన్న నేపథ్యం నుండి వచ్చిన వారే. వారికి నైపుణ్యాలను పెంపొందించే యంత్రాంగం అందు బాటులో లేదు. సరైన సదుపాయాలులేవు, ప్రోత్సాహం ప్రేరణ లేవు.ఫలితంగా నిరుద్యోగం, నిరాశా నిస్పృహలతో ఎందరో గ్రామీణ యువత నేడు నిరాశతో తల్లడిల్లుతున్నారు.నేటి అవాంఛనీయ పోటీ వాతావరణంలో యువత మార్కులు, ర్యాంకులు, కార్పొరేట్ ఉద్యోగాలు, ఐదారంకెల జీతాలు.. నేటి యువతలో అధిక భాగం వీటి చుట్టూనే తిరుగుతోంది. ఇదే జీవితానికి నిజమైన సక్సెస్ అంటూ నైతిక విలువలు సామాజిక స్పృహ లేకుండా జీవించే యువత నేడు కనిపిస్తుంది. కారణం వారికి జీవిత సాఫల్యం అనే దానికి సరైన నిర్వచనం తెలియక పోవడమే.
యువత.. రాజకీయాలు
భవిషత్తులో నువ్వు ఏమవుతావ్? అని నేటి తరం పిల్లల్ని అడిగితే ఏ ఇంజినీరో.. డాక్టరో.. పైలట్.. బిజినెస్ మెన్, ఇలా ఏవేవో చెప్తారే తప్ప. రాజకీయాల్లోకి వెళ్తామని మాత్రం ఎవరూ అనరు. అటువంటి వ్యవస్ధ అనేది ఒకటి ఉందని కూడా గుర్తించరు. నేటి యువతలో వారసత్వంగా రాజకీయ రంగంలోకి అడుగిడుతున్న వారున్నారు కానీ, ఎటువంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాజకీయాల వైపు మళ్లుతున్న యువత చాలా తక్కువేనని చెప్పాలి. వారసత్వ రాజకీయాలు అనేవి ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువు, వాటి అసమర్థత దేశానికి భారం అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. పైగా వారసత్వ రాజకీయాల అసమర్థత, చేతకానితనం వలన నియంతృత్వానికి ఓ కొత్త రూపం ఏర్పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో యువత రాజకీయాలంటే మురికి, అందులోకి ఎందుకు వెళ్లాలని చాలా మంది అనుకుంటున్నారు. ప్రభుత్వ విధానాల అమలు తీరు చూసి ప్రజాస్వామ్యం మీద యువతకు నమ్మకం లేకుండా పోయింది. రాజకీయ పార్టీలపై విశ్వాసం సన్నగిల్లిపోయింది. ఈ కారణాలు చేత రాజకీయ వ్యవస్థకి దూరంగా ఉండడం.రాజకీయాలు అనేవి మనకు సంబంధించిన విషయం కాదని యువత భావిస్తున్నారు. ఈ కారణం వల్లనే యువత ఓటింగ్‌లో పాల్గొనే శాతం కూడా తగ్గిపోవడం కనిపిస్తూ ఉంది. ఫలితంగా ఎన్నికలకు దూరంగా ఉండడం చేస్తోంది నేటి యువత. అయితే ఎవరూ శుభ్రం చేయకపోతే.. రాజకీయాల్లో ఆ మురికి కంపు ఇంకా అలాగే ఉంటుంది. దానికి నేటి యువతరం పూనుకోకుంటే, భావి తరాలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. రాజకీయాల శుభ్రతకు, డబ్బు, కులంతో పనిలేదు. యువతే నడుం బిగించాలి.
మత్తులో యువత
మందు, సిగరెట్, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలయ్యే వారిలోనూ అధిగబాగం యువతే. స్నేహితులు చెప్పారనో, సరదాగా ఒకసారి చూద్దామనో మొదలు పెట్టిన యువత క్రమేపీ తెలియకుండానే వాటికి బానిసవుతుంది. భీకర కాల సర్పాన్ని మించి భయానకంగా బుసలు కొడుతున్న మాదకద్రవ్య మహా రక్కసి నేడు దేశ యువత భవితను కసిగా కాటేస్తోంది. ఇంతలంతలవుతున్న డ్రగ్స్ వినియోగం కారణంగా దేశంలో అంధకారం, విధ్వంసం, వినాశం దాపురిస్తున్నాయి.నవభారత నిర్మాతలైన యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడంతో ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమై పోతున్నారు. దుర్వసనాల బారిన పడుతూ యుక్తవయసులోనే అనారోగ్యానికి గురౌతున్నారు. శరీర అంతర్భాగం తూట్లు తూట్లుగా మారిపోవడంతో జీవచ్ఛవాల్లా జీవిస్తున్నారు. యువతనే లక్ష్యంగా డ్రగ్ మాఫియా, సెక్స్ రాకెట్, కొకైన్, బ్రౌన్ షుగర్ వంటి మాదక ద్రవ్యాలతో యువతను నిర్వీర్యం చేస్తూ కోట్ల వ్యాపారం సాగిస్తున్న సంఘ విద్రోహుల ఆగడాలను నేటికీ కూడా ప్రభుత్వాలు కట్టడి చేయలేని స్ధితికి చేరుకున్నాయి. మద్యం, మాదకద్రవ్యాలకు, క్షణికావేశంలో తాత్కాలిక సుఖాలకు యువత అర్రులు చాస్తున్నారు. పబ్బుల్లో పార్టీల్లో అనేక మంది యువత నేడు మత్తులో మునిగి తేలుతున్నారు. ఇదే మత్తులో జరిగే లైంగికదాడులను మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. పబ్లిక్ స్కూల్ లో చిన్నారులు సైతం మాదక ద్రవ్యాలు వాడుతున్నట్లు వార్తలు చూస్తున్నాం. దేశ పురోగతికి దోహదపడే యువత ఇలా నిర్వీర్యం కావడం చాలా బాధాకరం. దీనిని ఇప్పటికైనా అదుపు చేయలేక పోతే ఈ జాడ్యం మరింత విస్తృతి చెందే ప్రమాదం లేకపోలేదు.
మూఢ నమ్మకాలు..
నేటి యువతలో చాలా మంది మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా అత్యంత విద్యా వంతులైన యువకులు కూడా అదృష్టం అనే పదాన్ని వినియోగిం చడం బాధాకరం. మన ప్రయత్న లోపాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఎదుటి వారి విజయాన్ని ఆంగీకరించలేని సందర్భాలలో అదృష్టం అనే పదాన్ని వినియోగిస్తూ ఉంటారు.దీనిని ఉద్దేశించి వివేకానంద అదృష్టం ఉన్న వ్యక్తి జీవితంలో ఒకసారి గెలుస్తాడు ప్రతిభ ఉన్న వ్యక్తి జీవితంలో ఒకసారే ఓడిపోతాడు స్వామి వివేకానందుడు చెప్పిన ఈ మాటల్లోనే వ్యక్తిత్వ వికాస సారమంతా ఒదిగి పోయింది. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు గొప్ప పాఠాలన్నీ ఆయన బోధనలో వినిపిస్తాయి.
జాగ్రత్త పడాల్సినవి..
నేటి యువతను సోషల్ మీడియా విపరీతంగా కాలహరణం చేయిస్తోంది. ఆనందంగా ఉండమని అనేక సరదాలకు ఆకర్షిస్తోంది. మిగిలిన వారిని ఇమిటేట్ చేయమంటోంది. అలా ఉండాలేమోనని కొంతమంది యువకులు యువతులు డిప్రెషన్ లోకి వెళ్లాల్సి వస్తోంది. సామాజిక మాధ్యమాలకు యువత బంధీ కావడం వల్ల వారి కుటుంబాలకు కూడా దూరం అయిపోతున్నారు. అయితే ఇదే సమయంలో ఇంటర్నెట్, సోషల్ మీడియాను పరిమితి మేరకు వినియోగించుకుంటూ ఆద్భుతాలు సాధిస్తున్న యువత కూడా ఉన్నారు. దీనికి తోడు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పౌష్టిక ఆహారంపై యువతకు పూర్తి పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడా పాస్ట్‌ఫుడ్ సెంటర్ల ఆహారనికే ఎక్కువ బందీ అయిపోయారు. దానికి తోడు కనీస వ్యాయామం కరువైంది.ఒక పక్క చదువుల్లో మరొక పక్క ఉద్యోగాల్లో తీవ్ర వత్తిడి ఫలితంగా ఎక్కువుగా యువత మానసిక రుగ్మతలకు గురి అవుతున్నారు. ఫలితంగా యుక్త వయసులోనే హుద్రోగ, ఊబకాయం, మధు మేహం వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. యువత అనేది ఉంటే సరిపోదు ఆరోగ్యవంతమైన యువత దేశానికి నిజమైన సంపద. ఆర్ధిక స్ధోమత ఉన్నప్పటికి చాలామంది యువత పోషకా హారాన్ని తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపు తున్నారు. అయితే ఆర్ధిక స్ధోమత లేక సాధారణ చదువులకే పరిమితం అయిన యువత కార్మికులుగా శ్రామికులుగా అసంఘటిత రంగంలో పని చేస్తూ కనీస అవసరాలు తీరక పేదరిక విష వలయంలో చిక్కుకుని ఉన్నారు.
ధైర్యమే ఆయుధం
భయమే మన బతుకుకు మన ప్రగతికి అవరోధం. ఈ భయం వల్లనే యువత తమ సహజ సామర్ధ్యాలను కూడా విని యోగించలేక పోతున్నారు. భయాలలో గల రకాలను వర్గీకరిస్తూ భయానికి గల హేతువులను కూడా వివరించారు స్వామి. జ్ఞానంలో అజ్ఞాన భయం, సంపదలో దారిద్య్ర భయం, సౌందర్యం లో వృద్ధాప్య భయం, శరీర విషయంలో సైతం మృత్యు భయం, ఉందనే సత్యాన్ని వెల్లడించారు. అంటే లోకంలో సమస్తమూ భయంతో కూడుకొని ఉందని, ఈ భయాలన్నీ చుట్టుముట్టడం వలనే యువతకు ధైర్యంగా అడుగులు పడటం లేదని చెప్పడమే కాదు వాటికి పరిష్కారంగా స్వామి భయాన్ని పొగోట్టడానికి ధైర్యాన్ని సాధనంగా వాడాలని చెప్పిన ఆశావాది స్వామి. గుణాత్మక జీవితం మన వశం అవ్వాలంటే కావలసిన ప్రాథమిక అంశం ధైర్యం. అందుకే వివేకానంద ధైర్యంలోనే బతుకు ఉంటుంది. భయంలో చావు ఉంటుందని చెప్పారు. మన దేశంలో పెద్ద ఎత్తున వ్యాపార, వాణిజ్య పారిశ్రామిక రంగాలలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం ఉన్న యువత లేకపోలేదు. అయితే వీరిలో ఎక్కువ మందిలో నష్ట భయాన్ని ఎదుర్కొనే సామర్థ్యం లేదు. పెట్టుబడి పెట్టి సంస్ధలను నెలకొల్పే ధైర్యం వీరిలో లేదు. ఇది కేవలం భయం వల్లనే జరిగే ప్రక్రియ. వీరిలో భయాలను పోగొడితే వారి నైపుణ్యాలు బయట పడతాయి. భయాందోళనలు బయటకు పోతాయి. దీనితో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్న యువత కూడా. గత వైఫల్యాలు లేదా పొరపాట్ల గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని విడిచిపెట్టి తమకున్న అద్భుత అవకాశాలను జారవిడుచుకుంటున్నారు. వర్తమానాన్ని గుర్తించని వారు ఎప్పటికి మంచి భవిష్యత్‌ను పొందలేరు.
స్వాతంత్రోద్యమంలో యువత పాత్ర
స్వాతంత్రోద్యమంలో ఉత్తుంగ తరంగాలై యువత పాల్గొంది. ఆంగ్లేయుల గుండెల్లో నిదురించిన అల్లూరి, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన భగత్ సింగ్ వంటి ఎందరో యువత పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడారు. ప్రాణాలు కోల్పోయారు. నేటి యువతలో ఆనాటి స్ఫూర్తి కొరవడింది. రాజకీయాలకు విద్యావంతులైన యువత దూరంగా ఉండకూడదు. కలుషితమైన రాజకీయాలను చైతన్యవంతమైన యువతే ప్రక్షాళన చేయాలి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వ్యవస్ధలను యువత నిందిస్తూ గడిపినంత కాలం వ్యవస్ధలు మరింత క్షీణించడం ఖాయం. ఇప్పటికైనా నాయకత్వ లక్షణాలు కలిగిన యువత రాజకీయ నాయకత్వం వహించడానికి ముందుకు రావాలి. చట్ట సభలకు వెళ్లి రాజకీయాలను ప్రక్షాళన చేసి దేశాన్ని యువశక్తి నడిపించాలి. ఇదే సందర్భంలో రాజకీయ పక్షాలు కూడా యువతకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధించ గలుగుతాము.
ప్రభుత్వాలు చేయాల్సినవి..
ఒక దేశం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యల కంటే అతి పెద్ద సమస్య ఏమిటంటే యువతరానికి సరియైన ఆలోచనా దృక్పథం లేకపోవడం. ప్రభుత్వాలు సరైన రీతిలో అవకాశాలు కల్పించలేక పోవడమే. దీనిపై దృష్టి పెట్టి నిర్మాణాత్మక చర్యలు చేపట్ట గలిగినట్లయితే మన దేశానికి వరంగా నిలచి ఉన్న యువ జనాభాను సరైన రీతిలో వినియోగించుకో గలం. యువత అంటే యువకులే కాదు యువతులు కూడా, సంఖ్యలోనే కాదు మేధస్సులో కూడా దాదాపు వారు సగ భాగంగా నిలచి ఉన్న యువతుల శక్తిసామర్ధ్యాలను ఉపయోగించుకునే అవకాశాలు వృద్ధి చేయాలి. యువతులలో శక్తి సామర్ధ్యాలు కలిగి ఉన్నప్పటికీ అవన్నీ నిర్వీర్యం అయిపోతున్న పరిస్ధితులు నేటి ఆధునిక సమాజంలో కూడా కొనసాగడం ఆలోచించాల్సిన విషయం. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తున్న వైనం మనందరికీ తెలిసిందే. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, యువత తమంతట తామే ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా అవసరమయ్యే వ్యూహాత్మక నైపుణ్యాలలో అవసరమైన శిక్షణను అందించ వలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది..అంతే కాకుండా రాజకీయాలలో యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వాలు విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటే రాజకీయాల్లో యువత ప్రాధాన్యత పెరుగుతుంది. పరిపాలనలో, యువ పాలనలో నవయువ శకం ఏర్పడుతుం దనడంలో ఎలాంటి సందేహం లేదు. పాలకులు యువశక్తిని చిత్తశుద్ధితో సద్వినియోగ పరిస్తే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించవచ్చు.
యువతకు స్ఫూర్తిగా నిలిచిన విజేతలు
పీవీ.సింధు
భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. భారతదేశం అత్యంత విజయవంతమైన క్రీడాకారులలో ఒకరిగా పరిగణించబడుతున్న సింధు, 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో సహా ఒలింపిక్స్, BWF సర్క్యూట్ వంటి వివిధ టోర్నమెంట్లలో పతకాలు గెలుచుకుంది. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి ఏకైక భారతీయురాలు. ఒలింపిక్ క్రీడలలో వరుసగా రెండు పతకాలను గెలుచుకున్న భారతదేశం నుండి రెండవ వ్యక్తిగత అథ్లెట్. క్రీడాకారిణిగా ఉంటూనే ఏపీలో జాయింట్కలెక్టర్గా నియామకమయ్యారు.
అరుణిమ సిన్హా
ఉత్తరప్రదేశ్ లక్నోకు చెందిన 26 ఏళ్ల అరుణిమ సిన్హా వాలీబాల్ క్రీడాకారిణి రైలులో ప్రయాణిస్తున్న సమయంలో దుండగులు ఆమెపై దాడి చేసి రైలు నడుస్తూ ఉండగానే బయటకు తోసేశారు. రెండు కాళ్ళు విరిగి పోయాయి ఒక కాలు తీసేసారు. అయినా ఆమె పట్టు విడవలేదు చరిత్ర సృష్టించాలి అనుకుంది. కేవలం 6 నెలల సమయం తరువాత కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి చరిత్ర సృష్టించింది
ఎన్.ఎం.స్వాతి
హైదరాబాద్‌కు చెందిన ఎన్ఎం స్వాతి పుట్టుకతో అంధురాలు. ఆమె తల్లిదండ్రులు ప్రోత్సాహంతో బ్రెయిలీ లిపిలో విద్యాభ్యాసం చేసింది. అద్భుత ప్రతిభ చూపింది. sbi లో ఉద్యోగం సంపాదించింది. మేనేజర్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం స్వాతి సికింద్రాబాద్‌లోని ఆర్‌ఏసీపీసీలో ఎస్బీఐ మేనేజర్‌గా పని చేస్తున్నది. అంధుల ఆత్మవిశ్వాసానికి పరీక్ష అని అనుకున్న స్వాతి తన పనితీరు ద్వారా ఉన్నత అధికారుల మన్ననలను అందుకుంది.
గోవింద్ జైస్వాల్
వారణాసికి చెందిన రిక్షా పుల్లర్ కొడుకు గోవింద్ జైస్వాల్ వయసు 24 సంవత్సరాలు. కనీస సౌకర్యాలు లేని పేద ప్రాంతంలో నివసించే జైస్వాల్ ఏళ్ల తరబడి కష్టపడి సివిల్ సర్వీస్ పరీక్షలో మొదటి ప్రయత్నంలో విజయం సాధించిన 474 మంది అభ్యర్థులలో అతను 48వ ర్యాంక్ సాధించాడు.
కిరణ్ బేడీ
అమృత్ సర్‌కు చెందిన కిరణ్ బేడీ ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌లో చేరిన మొదటి భారతీయ మహిళ. ఆమె ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) లో చేరడమే కాదు ఆ వృత్తిని సవాలుగా తీసుకుని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించింది. ఈ దేశంలోని ప్రతి స్త్రీ, పురుషులకు కిరణ్ బేడీ నిజమైన స్ఫూర్తి.
సత్య నాదెళ్ల
హైదరాబాద్ కు చెందిన సత్య నాదెళ్ల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO గా పని చేయడం భారతీయులు అందరూ గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో పని చేస్తున్న నేటి యువతకు ఆయన స్ఫూర్తి దాయకం
ఏ ఆర్ రెహమాన్
ఎఆర్ రెహమాన్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. తన తండ్రిని 9 ఏండ్ల వయస్సులో కోల్పోయాడు. అయినా కూడా పట్టుదలతో తన తండ్రి అందించిన వారసత్వాన్ని కొనసాగించి అద్భుత స్వర కర్తగా కీర్తిని ఆర్జించాడు.
పీటీ ఉష
జీవితంలో తనకంటూ ఓ ప్రత్యేకత, గుర్తింపు సంపాదించడానికి పరుగులు మొదలు పెట్టి ఇప్పటి వరకు 101 పతకాలు సాధించి లాస్ యాంగిల్స్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా ఉష రికార్డు సృష్టించింది.పద్మశ్రీ, అర్జున అవార్డులు కైవసం చేసుకుంది.
కల్పనా చావ్లా
అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర పుటల్లో నిలిచిన కల్పనాచావ్లా చరిత్రలో నిలిచింది. ఆకాశంలోనే కనుమరుగైనా ఆమె అందించిన స్ఫూర్తితో ఎంతో మంది భారతీయ యువతులు అంతరిక్ష విజ్ఞానంలో ఉన్నత శిఖరాలు అందుకుంటున్నారు.
- రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578