Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఔను..
నేనిప్పుడు
గతాన్ని తలచుకొని
వగచడం సరికాదనిపిస్తోంది.
విశ్వమానవ మనుగడలో
ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న నేను
వజ్రసంకల్పంతో సాగిపోవాలి
చీకటి పొరల్లోంచి
తలెత్తిన చిన్ని అంకురాన్ని
రేపటి సూరిన్నయి వెలుగులు పంచాలి.!
తరతరాల అణచివేతలోంచి
రగిలిన నిప్పుకణికను
ఆకాశపు అంచులదాకా దూసుకుపోవాలి
ఇప్పుడు
నేను వంటింటి కుందేలునూ కాదూ
వంట యంత్రాన్నీ కాదూ
ఒంటిచేత్తో ప్రగతిరథాన్ని
నడిపే సామ్రాగ్నిని..
అన్నట్టు..
ఇప్పుడెవరి చుట్టూతా తిరిగే
ఉపగ్రహాన్నీ కాదు..
ఎవరి అనుగ్రహాన్నీ కోరుకునే ఆధారితనూ కాను
నన్ను నేను వెలిగించుకుంటున్న
స్వయం ప్రకాశిని.
ఇప్పుడు
పెద్దర్వాజ కింది తొక్కుడుబండనీ..
వాడి పాడేసే కరివేపాకునూ కాదు
ఇంటిల్లిపాదికి
కడుపునింపే అన్నం ముద్దనీ
అంతకన్నా మించి అవనికే ప్రాణంపోసే
అమ్మనీ ...
ఆకాశంలో సగాన్ని నేనే..!
ఇప్పుడు
అగాధం లోంచి అంతరిక్షం దాకా..
అన్నింటిలో విస్తరించిందీ నేనే
ఏక కాలంలో
ఇంటినీ.. మింటినీ మోసే
సవ్యసాచినీ సకల పరాశక్తినీ నేనే
ఇప్పుడు
నా తొవ్వలలెదురైన
రాళ్లనీ ముళ్లనీ ఏరేసుకునే
ఆత్మవిశ్వాసం నాది
వెరసి ఒక జాతి పతాకానికుండే
ఆత్మగౌరవం కూడా నాదే..
ఇంతకన్నా..ఇంకేం కావాలి..!
మరు జన్మంటూ ఉంటే
మానవ మనుగడకే ప్రాణం పొసే
మహిళ నై పుట్టాలనే కోరుకుంటా..!
- నాంపల్లి సుజాత, 9848059893