Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెదవులమాటున దాగిన అంతరార్థం
మెత్తని కత్తిలా దూసుకు వస్తుంటే
హామీ ఇచ్చిన మాట నీటిమూటగా
తెగిపడుతున్న నమ్మకాలను
నిలువునా అధఃపాతాళానికి పాతేస్తుంటే
ఆరని మంటలా ఆక్రందనలు
అడవిని చుడుతున్న కార్చిచ్చులా...
అభయహస్తమనుకున్న మాట
ఆకలిగొన్న కడుపులకు గంజిబువ్వ
దప్పికగొన్న గొంతులకు గుండెచెలిమే
కాని, ఆమాట మాటమీద నిలబడలేదు
ఒంటరి దుఃఖాన్ని మోసే పక్షులకు తోడుగా నిలవలేదు
రాతం నడిచే శ్రమ రాళ్లకు ముళ్ల దారైంది
కసిగా రెక్కలు నరకుతున్న వాడికి
మాటిచ్చి మడమ తిప్పడం
తప్పులన ుఒప్పుగా ఒప్పించడం నిత్య ప్రహేళిక
గుక్క పట్టనివ్వని ప్రశ్నలను సమాధిచేసే ఏలిక
పురుగుమందులకు ప్రతిరోధకత పెంచుకున్న చీడ
రైతన్నకు గుదిబండైన పీడలా విస్మరించిన విశ్వాసాల క్రీడ
పాలకంకులను చిదిమి వేసె కత్తెర పురుగులా
తాయిలాలతో హరితాన్ని భస్మీపటలం చేసే గొంగళి పురుగు
మోర ఎత్తలేని కపట దారిద్య్రంలో
తోక కింద పొదిగిన వెచ్చని సమ్మతి విచ్చు కత్తుల వలగా
దశలు దశలుగా బరిలో
గాలివాటంకు వచ్చిపడుతున్న తాలు నాయక గణంగా
సారంలేని నేలలో గిడసబారిన పంట మన్నికలేని పేలికగా
నయాస్వామ్యంగా ముందుకు
సుప్తావస్థలోకి జారుకుంటున్న చైతన్యం అంకురించేదెప్పుడో
మరగుజ్జు ఆలోచనలతో వదులుకోలేని క్షేత్రంలో
నిష్ఫల సాగు క్రిమికి ఆహారంగా
పురుగు పుట్రల కాలంలో సస్య రక్షణ సాహసమే
ఏనాడు 'ఎప్పం' దాటి పోలేని సాగు నిరంతర తపన
విత్తు ఎంపిక వాస్తవమే
నిరోధించలేని జాడ్యం ఎందుకో
ఇప్పుడు కావల్సింది సామూహిక కలుపు తంత్రం
విష రసాయనాలు కాదు
రొడ్డు కారం ముద్దలతో పంచ గవ్య చికిత్స
- వేణుగోపాల్ రెడ్డి.బి