Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వు పడ్డ కష్టాల ముందు
ఈ సూదులు పెట్టిన కష్టం ఏ పాటివి...
నువ్వు పడ్డ గుండె కోతల ముందు
ఈ సర్జరీ కోతలు ఏ పాటివి...
నువ్వు పడ్డ అవమానపు మాటల ఫ్రీక్వెన్సీ ముందు
ఈ రేడియేషన్ల ఫ్రీక్వెన్సీ ఏ పాటిది...
నువ్వు ఎదుర్కొన్న చీత్కారాలకు పుట్టిన వేడికి
ఎక్కిన ఎన్నో బాటిల్ల రక్తం ఆవిరయిపోయే...
నువ్వు మింగిన కన్నీళ్ల తో
ఈ కీమో మందులే పల్చనైపోయే...
అందుకే ఇవేవీ పనిచెయ్యలే.....
ఈ కష్టాలు, బాధలు చూసి
పాపం అనుకున్నదేమో ఈ క్యాన్సర్...
ఎవరూ ఇవ్వని విముక్తిని తను నీకు ఇచ్చింది...
నీ మనసు అగాదాన్ని
పిల్లల ప్రేమ నింపలే...
అక్కచెల్లెళ్ళ అనుబంధం నింపలే...
ఆ ఆగాదాన్ని నింపే
ప్రేమని వెతికి వెతికి అలసిపోయిన నీకు
ఈ క్యాన్సర్ సాంత్వనని ఇచ్చిందేమో...
కానీ అమ్మ....
నీ కరములే కలం అయ్యి,
రక్తమే సిరాగ మారి,
నీ ఆలోచనలే అక్షరాలు అయి...
జగత్తులో రాయబడే ప్రతి కవితతో
కాగితమనే పాన్పుపై
నువ్వెప్పటికీ దర్జాగా, మాహారాణిలా
నవ్వుతూ పవలిస్తూనే ఉంటావ్...
- కె.టి.రఘురాం
సన్నాఫ్ బైరి ఇందిర