Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలు ఖరారు చేయని రాష్ట్రాలు
- ఈ సారికి పాత విధానంలో వేతనాలు
న్యూఢిల్లీ : కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల అమలు వాయిదా పడింది. సంబంధిత నిబంధ నలను రాష్ట్రాలు ఇంకా ఖరారు చేయకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి జరగాల్సిన నాలుగు కార్మిక చట్టాల అమలును కేంద్రం వాయిదా వేసింది. వీటి అమలు వల్ల తక్షణమే ఉద్యోగుల వేతనాలపై ప్రభావం పడేది. కోడ్ల అమలు ప్రక్రియ వాయిదా పడినందున 'ఇంటికి తీసుకెళ్లే వేతనాల మొత్తం'లో ఈ సారికి ఎలాంటి మార్పు వుండదు. కంపెనీలు కట్టే భవిష్యనిధి (పీఎఫ్) మొత్తాల్లో కూడా ప్రస్తుతానికి మార్పు లేనట్టే.
ఈ కార్మిక నిబంధనలు అమల్లోకి వస్తే ఉద్యోగుల మౌలిక వేతనం, పీఎఫ్‌లను లెక్కించే పద్ధతిలో తీవ్రమైన ప్రభావం పడివుండేది. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఇదివరకే నిర్ణయించింది. ఈ కోడ్ల కింద నిబంధనలను కూడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అను గుణంగా కొన్ని పారిశ్రామిక రాష్ట్రాలైనా కోడ్ల నిబంధనలను ఖరారు చేస్తాయని కేంద్రం భావించిందనీ, అయితే ఆ దిశగా రాష్ట్రాల నుంచి స్పందన రాకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సిన కోడ్లు ప్రస్తుతానికి వాయిదా పడినట్లేనని కార్మిక శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి నిర్ధారించారు. 'లేబర్ కోడ్ల అమలు ఏప్రిల్ 1 నుంచి ఉండకపోవచ్చు. చట్టపరమైన
చిక్కులు నుంచి బయటపడేందుకు కనీసం కొన్ని పారిశ్రామిక రాష్ట్రాలైనా కోడ్ల నిబంధనలను నోటిఫై చేస్తాయని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ చాలా రాష్ట్రాలు వాటిని ఖరారు చేయలేదు' అని సదరు అధికారి వివరించారు. ఇప్పటి వరకు జమ్ముకాశ్మీర్ ఒక్కటే నాలుగు లేబర్ కోడ్లకు నిబంధనలను ఖరారు చేసి నోటిఫై చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రెండు కోడ్లకు ముసాయిదా నిబంధనలను సిద్ధం చేశాయి. కర్నాటక ఒక కోడ్‌కు మాత్రమే నిబంధనలను ఖరారు చేసింది. ఇక మిగిలిన రాష్ట్రాలేవీ ఈ దిశగా స్పందించలేదు. భారత రాజ్యాంగం ప్రకారం కార్మికుల అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. అందువల్ల తమతమ పరిధులలో ఈ నాలుగు కోడ్లు అమల్లోకి రావాలంటే అటు కేంద్రంతోపాటు ఇటు రాష్ట్రాలు కూడా నిబంధనలను నోటిఫై చేయాల్సి వుంటుంది. నూతన వేతనాల చట్టం కింద, అలవెన్సులు 50 శాతానికే పరిమితమవుతాయి. అంటే ఉద్యోగి స్థూల వేతనంలో సగం మౌలిక వేతనంగా వుండాల్సి వుంటుంది. మౌలిక వేతనంలో కొంత శాతాన్ని పీఎఫ్‌గా లెక్కిస్తారు. బేసిక్ పే, డీఏ కలిసి మౌలిక వేతనంగా వుంటుంది. ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 1 నుండి కొత్త లేబర్ కోడ్లను అమలు చేసినట్లైతే చాలా కేసుల్లో ఉద్యో గులు ఇంటికి తీసుకెళ్లే వేతనం, సంస్థలు కట్టే పీఎఫ్ మొత్తాల్లో మార్పులు చేర్పులు జరిగేవి. కోడ్ల నిబంధనలను రాష్ట్రాలు ఖరారు చేయలేదంటూ వీటి అమలును వాయిదా వేస్తున్నట్టు పైకి చెబుతున్నా.. కార్మికులు ఇటీవల నిర్వహించిన దేశవ్యాప్త ఆందోళనలు వల్లే కేంద్రం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం కూడా వాయిదాకు ఒక కారణంగా భావిస్తున్నారు.