Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూటమి ఏర్పాటుకు ముమ్మర యత్నాలు
- సమాలోచనలు జరుపుతున్న నితీష్
- వచ్చే నెలలో బీహార్‌లో భేటీ
న్యూఢిల్లీ : కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత దిశగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే నెలలో పాట్నాలో ప్రతిపక్ష నాయకులందరితో సమావేశం నిర్వహించాలని ఆయన యోచిస్తున్నారు. అయితే ఆయా నేతలను సంప్రదించిన తర్వాత సమావేశ తేదీని ఖరారు చేస్తారు. ఈ లోగా నితీష్ ప్రతిపక్ష నాయకులతో విడివిడిగా సమావేశమవుతారు. సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో బీజేపీ యేతర పార్టీలను కూడగట్టి కూటమిని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు.
నితీష్ ప్రయత్నాలను బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థానీ ఆవామ్ మోర్చా (లౌకిక) వ్యవస్థాపకుడు జితన్ రామ్ మంజీ కొనియాడారు. గతంలో జయప్రకాష్ నారాయణ్ జరిపిన ప్రయత్నాలతో పోల్చారు. '1977లో పలు ప్రతిపక్ష పార్టీలను జనతా పార్టీ గొడుగు కిందికి జేపీ ఎలా తీసుకొచ్చారో ఇప్పుడు నితీష్ కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు' అని అన్నారు. కాగా తన ప్రయత్నాలలో భాగంగా నితీష్ కుమార్ ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌లతో సమావేశమయ్యారు. గత శుక్రవారం ఆయన ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధిపతి బద్రుద్దీన్ అజ్మల్‌తో చర్చలు జరిపారు. అయితే నితీష్ ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో సమావేశం కాలేదు.
ప్రతిపక్షాల ఐక్యతకు బీహార్ మార్గదర్శిగా నిలుస్తుందని జేడీ (యు) ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నీరజ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆర్జేడీ, కాంగ్రెస్ సహా ఆరు పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో సమాలోచనల తర్వాతే నితీష్ ప్రతిపక్ష నేతలను కలుస్తున్నారని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ సాధించిన విజయం ప్రతిపక్షాలకు ఊతమిచ్చిందని, బీజేపీ యేతర పార్టీలన్నింటిలో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. 'బీజేపీ ఇప్పుడు తనను తాను జాతీయ పార్టీగా ఎలా చెప్పుకుంటుంది ? దక్షిణాదిలో వారు ఎక్కడా కన్పించడం లేదు. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిసా, జార్ఖండ్ రాష్ట్రాలలో అధికారంలో లేరు. దుష్ట పన్నాగాలు పన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో అధికారాన్ని అనుభవిస్తున్నారు' అని బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విమర్శించారు.
ప్రతిపక్ష నేతలతో నితీష్ తొలి విడత చర్చలు జరిపిన తర్వాత మహా కూటమి ఒక రూపం తీసుకుంటుందని బీహార్‌లోని మహా ఘట్బంధన్ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాలను ఏకం చేసే సామర్ధ్యం బీహార్‌కు ఉన్నదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమె ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకుంటామని, అదే విధంగా కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతల అంగీకారం తీసుకొని ప్రతిపక్షాల సమావేశ తేదీని ఖరారు చేస్తామని నితీష్ సన్నిహిత వర్గాలు చెప్పాయి. సమావేశం వచ్చే నెలలో జరగవచ్చునని ఆ వర్గాలు తెలిపాయి.