Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : 'రాజకీయమనేది మురికి కూపం... దాన్ని కడిగేందుకే రాజకీయాల్లోకి వచ్చా' అన్నారు 'మక్కల్ నీది మయ్యం' వ్యవస్థాపకులు, నటుడు కమలహాసన్. మంగళవారం చెన్నై వేళచ్చేరి నియోజకవర్గ అభ్యర్థి ఐఎఎస్ సంతోష్‌బాబుకు మద్దతుగా ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ... రాజకీయాలు మురికి కూపాలని, అందుకే చదువుకున్న వారు ఇందులోకి దిగడం లేదని, రాజకీయాలను వారు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇలా వదిలేయడంతోనే రాజకీయాలు మురికి కంపు కొడుతున్నాయని అన్నారు. ఈ కూపాన్ని శుభ్రం చేయాలని గ్రహించే... తాను ఇందులోకి దిగినట్లు చెప్పారు.
తనతో పాటు 'మక్కల్ నీది మయ్యం'లోని ప్రతి ఒక్కరం పారిశుద్ధ్య కార్మికులమని, రాజకీయాల్లో మురికిని కడిగేందుకు వచ్చామని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజకీయాలను శుభ్రం చేయకపోతే... భవిష్యత్తు తరాలు ఇప్పటి తరం వారిపై దుమ్మెత్తిపోస్తాయని పేర్కొన్నారు. జనం కోసం వచ్చిన ఈ పారిశుద్ధ్య కార్మికులను ఆదరించాలని విన్నవించారు. తమను చూసి ఇతర పార్టీలు భయపడుతున్నందుకే, ఇబ్బందులు కలిగేలా చేస్తున్నాయని విమర్శించారు. అలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని కమల్ పేర్కొన్నారు.