Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 1న మజ్దూర్ దినోత్సవం
- అదే నెలలో పార్లమెంట్ ముట్టడి
- కార్యాచరణ ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా
- 125వ రోజుకి రైతు ఉద్యమం
- సుప్రీమ్‌కు సీక్రెట్ నివేదిక సమర్పించిన కమిటీ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పార్లమెంట్లో ఆమోదించుకున్న మూడు సాగు వ్యతిరేక చట్టాల రద్దు, అన్నదాతల పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న దేశవ్యాప్త రైతాంగ ఉద్యమం బుధవారంతో 125వ రోజుకి చేరుకుంది. ఇప్పటివరకు ఈ మహౌన్నత రైతాంగ పోరాటంతో సుమారు 320 మంది అన్నదాతలు వీరమరణం పొందారు. కాగా, ఎస్కేఎం నేతలు బుధవారం తమ కార్యాచరణ ప్రకటించారు. బీఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీన సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం ఎస్కేఎం జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఆ సంఘం నేత దర్శన్పాల్ బుధవారం మీడియాకు వెల్లడించారు. మే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేపథ్యంలో ఆ రోజు మజ్దూర్ డే నిర్వహిస్తామని చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లోని ఘాజీపూర్, సింఘూ, టిక్రీ, షాజహాన్‌పూర్ వంటి రైతు ఉద్యమ కేంద్రాల్లో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుతామన్నారు. ఆ రోజంతా కార్మికులు, కర్షకుల ఐక్యతకు సంబంధించిన అంశాలపై సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ ఐదవ తేదీన ఎఫ్‌సీఐ బచావో దివస్ నిర్వహించి దేశంలోని అన్ని ఎఫ్‌సీఐ కేంద్రాల ముందు భారీ స్థానలో ఆందోళనా కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఏప్రిల్ 13వ తేదీన కేఎంపీ ఎక్స్‌ప్రెస్ హైవేను 24 గంటల పాటు రోడ్డు బ్లాక్(రహదారి దిగ్బంధనం) చేస్తామన్నారు. మే నెల మొదటి రెండు వారాల్లో పార్లమెంట్ మార్చ్ చేపడుతామన్నారు. ఈ మార్చ్‌లో కర్షకులు, కార్మికులు, మహిళలు, దళిత, ఆదివాసీ, బహుజన, నిరుద్యోగ తదితర వర్గాల ప్రజానీకం పాల్గొంటారని అన్నారు. శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తామంతా సొంత వాహనాలతో ఢిల్లీ సరిహద్దుల వరకు చేరుకుంటామని, అక్కడి నుంచి పార్లమెంట్ వైపు పాదయాత్ర చేపడుతామన్నారు. అయితే, ఈ మార్చ్ నిర్వహణకు సరైన తేదీని తొందరలోనే ప్రకటిస్తామని దర్శన్ పాల్ తెలిపారు. ఈ సమావేశంలో గుర్నామ్ సింగ్ చాదుని, ప్రేమ్ సింగ్ భంగు, సత్నామ్ సింగ్ అజ్నులా, రవిందర్ కౌర్, సంత్టోక్ సింగ్, బుటా సింగ్ బుర్జగిల్, జోగిందర్ నాయిన్, ప్రదీప్ ధన్కాద్ తదితరులు ఉన్నారు. కేరళలో ఎస్కేఎం నేత బిజూపై బీజేపీ దాని అనుబంధ సంఘాల దాడిని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తీవ్రంగా ఖండించారు.
సుప్రీమ్‌కు సిక్రెట్ నివేదిక సమర్పించిన కమిటీ
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది. మొత్తం 85 రైతు సంఘాలతో తాము సంప్రదింపులు జరిపినట్టు ఈ సందర్భంగా కమిటీ వెల్లడించింది. వాళ్లందరితో మాట్లాడిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించినట్టు చెప్పింది. అయితే రిపోర్టులో ఏముందో బహిర్గతం చేయలేదు. దీనిపై ఏప్రిల్ 5న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గత జనవరి 12న వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రెండు నెలల పాటు అమలును నిలిపేసి కమిటీని నియమించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆలోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.