Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వరంగ సంస్థలు ప్రయివేటీకరించాక.. రిజర్వేషన్లు ఉండవన్న కేంద్రం
- వాటాల్ని కొనుగోలుచేసే పెట్టుబడుదారులకు కేంద్రం హామీ
న్యూఢిల్లీ : రిజర్వేషన్ల అమలును దెబ్బకొట్టే వ్యూహంతో మోడీ సర్కార్ వెళ్తోంది. ప్రభుత్వరంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణ జరిగాక ఆయా సంస్థల్లో ఇకపై రిజర్వేషన్ల అమలు ఉండబోదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎయిరిండియా, బీపీసీఎల్, ఓఎన్జీసీ-హెచ్పీసీఎల్, ఐడీబీఐ బ్యాంక్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..మొదలైనవాటిల్లో మోడీ సర్కార్ పెద్ద ఎత్తున ప్రయివేటు పెట్టుబడుల్ని ఆహ్వానిస్తోందన్న విషయం తెలిసిందే. '' ప్రభుత్వరంగంలో వాటా కొనుగోలు చేశాక..రిజర్వేషన్లు ఉండవు. వాటిని అమలుజేయాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇష్టం. చట్టపరంగానూ అది సాధ్యం కాదు'' అని ప్రయివేటు పెట్టుబడు దారులకు మోడీ సర్కార్ హామీ ఇచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మోడీ సర్కార్ చేపట్టిన పెట్టుబడుల ఉపసంహరణ అంశంతో నేరుగా సంబంధాలు కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ముగ్గురు పై విషయాల్ని మీడియాతో పంచుకున్నారు. ప్రభుత్వసంస్థలో అప్పటికే పనిచేస్తున్న సిబ్బంది, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కేటగిరీల్లో ఉన్న ఉద్యోగుల కొనసాగింపునకు కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. ప్రయివేటీకరణ జరిగిన ప్రభుత్వసంస్థలో కొత్తగా చేపట్టే ఉద్యోగ నియామకాలకు మాత్రం రిజర్వేషన్లు వర్తించవని, వాటిని అమలుజేయాల్సిన అవసరం లేదన్నది కేంద్రం
ఆలోచన. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు రిజర్వేషన్లు కచ్చితంగా పాటించాలి. చట్టప్రకారం 15శాతం ఎస్సీ, 7.5శాతం ఎస్టీ, 27శాతం ఓబీసీ సామాజిక వర్గాలతో భర్తీ చేయాలి. అయితే మోడీ సర్కార్ భారీ స్థాయిలో చేపట్టిన ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ, వాటాల అమ్మకంతో రిజర్వేషన్లకు తూట్లు పొడిచే పరిస్థితి ఏర్పడింది. ప్రయివేటు పెట్టుబడుదారులకు అనుకూలంగా ఒప్పందాలు చేసుకుంటోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఉదాహరణకు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని మోడీ సర్కార్ ప్రయివేటీకరిస్తోంది. ఒకసారి ఇవి ప్రయివేటు పెట్టుబడుదారుల చేతుల్లోకి వెళ్లాక, ఇక ఆ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు నిలిచిపోతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.