Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆవును గోమాత, గోపూజల పేరుతో మత విద్వేషాలను రెచ్చగొడుతూ, రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ, మోడీ ప్రభుత్వ అసలు రంగు బయటపడింది. ఆవుల సంరక్షణ, పోషణ నుంచి కేంద్రం పక్కకు తప్పుకున్నది. బ్రిటిష్ హయంలో 132 ఏండ్ల కిందట భారత ఆర్మీలో పురుడుపోసుకున్న గోశాలలకు గోరీ కట్టారు. భారతీయ సైనికులకు స్వచ్ఛమైన పాలను అందించేందుకు ఎప్పటి నుంచో ఉన్న ఈ గోశాలలను మూసి వేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారతీయ సైన్యంలో 132 ఏండ్లుగా కొనసాగుతున్న పాడి పరిశ్రమను కలం పోటుతో మూతేసింది. దేశానికి ఘనమైన సేవలు అందించిన ఈ సంస్థకు ఇక తెరపడింది... అని రక్షణ శాఖ ప్రకటించింది. సైనికులకు స్వచ్ఛమైన ఆవు పాలు అందించే ఉద్దేశంతో బ్రిటిషు హయాంలో తొలిసారిగా అలహాబాద్‌లో 1889 ఫిబ్రవరి 1న తొలి పాడి పశువుల శాలను ఏర్పాటు చేశారు. ఆ తరువాత సైన్య శిబిరాలు కొలువైన ప్రతి చోటా వీటిని ఏర్పాటుచేశారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశం నలుమూలల్లో ఉన్న 130 సైన్యం పాడి పశువుల శాలల్లో 30 వేల ఆవులుండేవి. లేV్‌ా కార్గిర్ ప్రాంతంలోని సైనికులకు స్వచ్ఛమైన పాలు అందించేందుకు 1990 దశకం చివరలో అక్కడ వీటిని ఏర్పాటు చేశారు. సైన్యానికి పాల సరఫరాతో పాటు భారీ విస్తీర్ణంలో ఉన్న సైనిక భూముల రక్షణ, నిర్వహణ, ఇతర ప్రాంతాలకు ఎండు గడ్డి సరఫరాకు ఇవి ఉపయోగపడేవి. ఈ పశుశాలల్లోని ఆవుల నుంచి ఏటా 3.50 కోట్ల లీటర్ల పాలు, 25,000 మెట్రిక్ టన్నుల ఎండు గడ్డి ఉత్పత్తి అయ్యేది. ఈ శాలల్లోని ఆవులకు కృత్రిమ గర్భధారణ పద్ధతులు వినియోగించి మేలైన పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతున్నది. 1971 యుద్ధం సమయంలో పాల సరఫరా, ఇతర ఆరోగ్య సేవలకు ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. వెస్ట్రన్, ఈస్ట్రన్ యుద్థాల్లో పాల సరఫరా, కార్గిల్ యుద్ధ సమయంలోనూ నార్తర్న్ కమాండ్‌కు పాల సరఫరా చేశారు. ఈ పశు శాలల నుంచి పాలు సరఫరాతో పాటు ఇతర సేవలను సైన్యం పొందింది. కేంద్ర వ్యవసాయ శాఖతో కలిసి ప్రపంచంలోనే పెద్దది అయిన సంకర జాతి పశుసంపద సృష్టికి ప్రాజెక్టు ప్రెస్వాల్ను ఈ విభాగం చేపట్టింది. జీవ ఇంధన ఉత్పత్తికి సంబంధించి రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)తో ఒప్పందం చేసుకుంది. అయితే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుతం ఎన్ని పశుశాలలు ఉన్నాయి? వాటిలో ఎన్ని ఆవులున్నాయి? వాటిని ఏం చేశారనే అంశంపై స్పష్టతలేదు. అయితే వివిధ వివరాల ప్రకారం రెండేండ్ల కిందట వరకు ఈ పశుశాలల్లో 25 వేలకు పైగా ఆవులు ఉండేవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 39 గోశాలల్లో (20 వేల ఎకరాల విస్తీర్ణం) వెయ్యి మందికి పైగా ఉద్యోగులు ఉండగా.. వారిని సైన్యంలోని ఇతర విభాగాలకు పంపిస్తున్నారు. సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలు, విభాగాల నుంచి తప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పడు తాజాగా ప్రాధాన్యం లేని రంగాలు, విభాగాల పేరుతో సైన్యానికి స్వచ్ఛమైన పాలు ఇచ్చే పశుశాలలను మూసివేసింది.