Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
టీఆర్ఎస్ ఎంపీ, మహబూబాద్ లోక్‌సభ సభ్యురాలు మాలోత్ కవిత పీఏలమంటూ ఢిల్లీలోని ఆమె అధికారిక నివాసానికి సమీపంలో అక్రమాలకి పాల్పడుతూ ముగ్గురు వ్యక్తులు సీబీఐకి అడ్డంగా దొరికపోయాడు. స్థానిక ఢిల్లీకి చెందిన మన్మిత్ సింగ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి సంబంధించిన విషయంలో అనుమతులు లేవన్న సాకుతో అందుకు రూ. ఐదు లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగగా, రూ. లక్షకు డీల్ చేసుకున్న విషయంలో సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ తతంతమంతా టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత ఇంట్లోనే ఉండి ప్లాన్ చేశారనీ, కానీ ఫిర్యాదుదారుడి నుంచి డబ్బులు తీసుకునేందుకు యత్నించే తరుణంలో మాత్రం సీబీఐ ఆమె అధికారిక నివాసానికి సమీ పంలో వారిని అరెస్టు చేసినట్టు వెల్లడించింది. ఈ విషయం దేశ రాజధానిలో సర్వత్రా చర్చనీయాంశమైంది. సీబీఐ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.... తెలంగాణ ఎంపీ కవిత పీఏలమంటూ రాజీబ్ భట్టాచార్య, సుభాంగీ గుప్తా, దుర్గేశ్ ముగ్గుర వ్యక్తులు ఢిల్లీ న్యూగుప్తా నివాసితుడు మన్మీత్ సింగ్ లాంబా నివాసాన్ని అక్రమంగా నిర్మించారని ఆరోపణలతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కూల్చేయనున్నదనీ, కూల్చకుండా చూసుకుంటా మంటూ లాంబాను సంప్రదించారు. ఎంసీడీలో అధికారి తెలుసునంటూ రూ. ఐదు లక్షలు ఇస్తే ఇల్లు కూల్చకుండా చూసుకుంటామని తెలిపారు. అయితే, తాను అంత ఇచ్చుకో లేనని చెప్పడంతో రూ. లక్షకు డీల్ సెట్ చేశారు. ఈక్రమం లో టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత అధికారిక నివాసంలో ఉన్నామని అక్కడికి మనీ తీసుకురావాలని ఫిర్యాదుదారు డిపై సోకాల్డ్ పీఏలు ఒత్తిడి పెంచారు. వీరితో టచ్‌లోనే ఉన్న ఫిర్యాదుదారుడు మరోవైపు సీబీఐ ఉన్నతాధికారులను సంప్రదించి, వారి సాయంతో వీరిని అరెస్టు చేయించారు. గురువారం రూ.లక్ష లంచం తీసుకునే క్రమంలో ముగ్గుర్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రాజీవ్ భట్టాచార్యతో పాటు శుభాంగి గుప్తా, దుర్గేష్కుమార్లుగా ఉన్నారు. ''ఎంసీడీలో అధికారి తనకు తెలుసుననీ, తాను టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితన పీఏనంటూ రాజీవ్ భట్టాచార్య పరిచయంచేసుకున్నాడు, ఎంపీ కవితకు కోఆర్డినేటర్ అంటూ శుభాంగి గుప్తాను పరిచయం చేశాడు. తదుపరి దుర్గేష్ కుమార్‌ను తీసుకొచ్చి ఎంపీ మరో పీఏ అంటూ పరిచయం చేశాడు. ముగ్గురూ కలిసి ఎంసీడీ ఇల్లు కూల్చకుండా చూసుకుంటామని రూ. ఐదు లక్షలు డిమాండు చేశారు. తదనంతరం జరిపిన చర్చల్లో చివరకు రూ. లక్షకు బేరం కుదుర్చుకున్నారు. బీష్మంబర్దాస్ మార్గ్‌లోని ఎంపీ నివాసానికి సొమ్ములు తీసుకురావాలని చెప్పారు'' అంటూ లాంబా ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది. ఎంపీ అధికారిక నివాసంలో సీబీఐ అధికారులు ముగ్గురునీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 120(బీ), 384తోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7(ఏ) ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాళ్ళు నా పీఏలు కాదు... దుర్గేశ్ మాత్రమే నా డ్రైవర్ కవిత, ఎంపీ
ఢిల్లీలో సీబీఐ అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తుల అంశంపై స్పందించిన ఎంపీ మాలోత్ కవిత, వాళ్ళు తన పీఏలు కాదన్నారు. నాకు ఢిల్లీలో ఎలాంటి పీఏలు లేరని చెప్పుకొచ్చారు. గురువారం ఈ ఘటన తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆమె ఒక వీడియో సందేశమిచ్చారు. తన పనులన్నీ తానే చేసుకుంటున్నట్టు... తనకు పీఏలెవరూ లేరని స్పష్టం చేశారు. అయితే, దుర్గేశ్ మాత్రం తన డ్రైవర్ అని చెప్పుకొచ్చారు. దుర్గేశ్‌కి మాత్రం తన స్టాఫ్ క్వార్టర్ ఇచ్చినట్టు వెల్లడించారు. మిగిలిన ఇద్దరు ఎవరో తనకు తెలియదన్నారు. తన పీఏలుగా చెప్పుకొని ఇలాంటి పనులు చేస్తున్నవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని కవిత వ్యాఖ్యానించారు.