Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా పెరిగిన స్త్రీ, పురుషుల మధ్య అంతరాలు
- 'గ్లోబల్ జెండర్ గ్యాప్' నివేదికలో భారత్‌కు 140వ స్థానం
- విద్య, వైద్యం, కార్మికశక్తిలో గణనీయంగా పడిపోయిన మహిళా ప్రాతినిథ్యం
- గత ఏడాదితో పోల్చితే 28 స్థానాలు కిందికి..
న్యూఢిల్లీ : భారత్‌లో స్త్రీ, పురుషుల మధ్య అంతరాలు (సామాజికంగా, ఆర్థికంగా..) తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి. ఇంటా, బయటా మహిళలు వివక్షను ఎదుర్కోవటం మరింత పెరిగిందని ప్రపంచ ఆర్థిక మండలి 'గ్లోబల్ జెండర్ గ్యాప్' 2021 నివేదిక పేర్కొంది. ఈ ఏడాది భారత్ ర్యాంక్ 28 స్థానాలు పడిపోయి 140వ ర్యాంక్‌లో నిలబడింది. దక్షిణాసియా దేశాల్లో లింగ బేధం అత్యంత తీవ్రస్థాయిలో ఉన్న దేశాల్లో భారత్ ఒకటని నివేదిక అభిప్రాయపడింది. గత ఏడాది గ్లోబల్ జెండర్ గ్యాప్ ర్యాంకింగ్స్‌లో భారత్ 112వ స్థానంలో నిలిచింది. ఆర్థిక ప్రాతినిథ్యం, అవకాశాల ఆధారంగా భారత్‌కు ఈ ఏడాది 140వ స్థానం దక్కిందని నివేదిక తెలిపింది. ముఖ్యంగా రాజకీయ సాధికారత సూచికలో భారత్ పొందిన పాయింట్లు (13.5శాతం) ర్యాంకు పడిపోవడానికి ముఖ్య కారణమని తెలిసింది. కార్మికశక్తిలో మహిళా ప్రాతినిథ్యం 24.8శాతం నుంచి 22.3శాతానికి పడిపోయింది. వృత్తి నిపుణులు, టెక్నికల్రంగాల్లోనూ గణనీయంగా తగ్గింది. సీనియర్, మేనేజర్ స్థానాల్లో వరుసగా 14.6శాతం, 8.9శాతం మహిళలున్నారు. ఇక ఆదాయం విషయానికొస్తే, దేశంలోని మొత్తం మహిళల ఆదాయం..20శాతం పురుషుల ఆదాయానికి సమానంగా ఉందని నివేదిక అంచనావేసింది. ఈ అంశంలో అట్టడుగున ఉన్న 10దేశాల్లో భారత్ ఒకటని నివేదిక గుర్తుచేసింది. విద్య, జీవన మనుగడ..మొదలైన ఉప సూచికల్లో భారత్ ప్రదర్శన తీసికట్టుగా ఉంది. దాదాపు 93.7శాతం మంది మహిళలు వివక్షకు గురవుతున్నారు. కడుపులో ఉన్నది ఆడ శిశువని తెలుసుకొని అబార్షన్లు చేస్తున్నారని, ఇది భారత్‌లో తీవ్ర స్థాయిలో ఉందని నివేదిక తెలిపింది. ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు కుటుంబంలో వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. పురుషుల్లో 17.6శాతం నిరక్షరాస్యులుంటే, మహిళల్లో 34.2శాతం ఉన్నారని తేలింది.
ఈ నివేదికలో బంగ్లాదేశ్ 65వ ర్యాంకు సాధించి మెరుగైన స్థానంలో నిలబడింది. పాకిస్థాన్-153, ఆఫ్ఘనిస్థాన్-156, భూటాన్-130, శ్రీలంక-116 ర్యాంకులు సాధించాయి. భారత్‌లో లింగ బేధం 62.5 శాతంగా నమోదైంది.