Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా/గువహటి : కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా పశ్చిమబెంగాల్, అసోంలలో అసెంబ్లీ రెండో విడత ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. బెంగాల్ రెండో దశలో 80.43 శాతం పోలింగ్ నమోదు కాగా, అసోంలో 74 శాతం మంది ఓటర్లు ఓటేశారు. బెంగాల్లో మూడు జిల్లాల్లోని 30 స్థానాలకు, అసోంలో 39 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచిన నందిగ్రామ్‌లో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బోయల్ ఏరియాలోని పోలింగ్ కేంద్రానికి ఆమె వెళ్లగా ఆ సమయంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మమత రాగానే బీజేపీ కార్యకర్తలు 'జై శ్రీరామ్' నినాదాలు చేశారు. నందిగ్రామ్‌లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తానని మమత పేర్కొన్నారు. ఖేష్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్న తన్మరు ఘోష్ కారుపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలింగ్ రోజున నందిగ్రామ్ బీజేపీ, ఖేష్పూర్లో టీఎంసీ కార్యకర్తల మరణాలు కలకలం రేపాయి. ఈ మరణాలపై ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక, అసోంలో బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) నేత హగ్రమా మోహిలరీకి బెదిరింపుల ఆరోపణలపై బీజేపీ నేత, మంత్రి హిమంత్ బిశ్వాస్ శర్మకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.