Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిమినల్ కేసుపై కర్నాటక హైకోర్టు ఆదేశాలు
- జెడీ(ఎస్) ఎమ్మెల్యేకి మంత్రిపదవిస్తానని ప్రలోభపెట్టారని ఆరోపణలు
న్యూఢిల్లీ : కర్నాటక సీఎం యడియూరప్పపై నమోదైన క్రిమినల్ కేసులో విచారణ చేపట్టాలని కర్నాటక హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తనతో చేతులు కలిపితే మంత్రి పదవిస్తానని, పెద్ద మొత్తంలో డబ్బుకూడా ముట్టజెపుతానని జనతాదళ్ (సెక్యూలర్) ఎమ్మెల్యే నాగనగౌడ కందుకూర్ను యడియూరప్ప ప్రలోభపెట్టారని ఫిబ్రవరి 2019లో క్రిమినల్ కేసు నమోదైంది. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోయడానికి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పి తిరుగుబాటు లేవదీశారని, పదవులిస్తామని ఆశపెట్టారని యడియూరప్పపై ఆరోపణలున్నాయి. ప్రభుత్వాన్ని కూలదోయడానికి యెడియూరప్ప నేతృత్వంలో బీజేపీ చేసిన రాజకీయాలను 'ఆపరేషన్ కమలా'గా పిలుస్తారు. తిరుగుబాటు అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతుతో యడియూరప్ప సీఎం పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. ఫిర్యాదుదారులు ఆనాటి కుట్రపూరిత రాజకీయాలకు సంబంధించి యడియూరప్ప ఫోన్ సంభాషణల ఆడియో రికార్డుల్ని పోలీసులకు సమర్పించారు.
యడియూరప్పపై గవర్నర్కు మంత్రి ఫిర్యాదు
కర్నాటక సీఎం యడియూరప్పపై రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఈశ్వరప్ప రాష్ట్ర గవర్నర్ వజూభారు వాలాకు ఫిర్యాదు చేశారు. తన శాఖ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈమేరకు ఐదు పేజీల ఫిర్యాదు పత్రాన్ని గవర్నర్కు సమర్పించారు. తనకు తెలియజకుండానే తన శాఖ నుంచి ముఖ్యమంత్రి రూ.774కోట్లు విడుదలచేశారని, మార్చి 4న రూ.460కోట్ల రూపాయల విలువజేసే పనులకు నిధులు మంజూరు చేశారని, తనతో సంప్రదించ కుండా సీఎం ఏకపక్షంగా వ్యవహరించారని ఈశ్వరప్ప ఆరోపించారు.