Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా బీజేపీ-ఆరెస్సెస్ కుయుక్తులు
- సొంత ప్రయోజనాలకు మోడీ సర్కారు ఆరాటం : రాజకీయ నిపుణులు
- వెనక్కితగ్గని రైతులు.. ఉద్యమం ఉధృతానికి ప్రణాళికలు
న్యూఢిల్లీ : మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు గత నాలుగు నెలలుగా నిర్విరామంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనలతో హౌరెత్తిస్తున్నారు. వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో మోడీ సర్కారుపై రైతులు పోరాడుతున్నారు. దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమానికి దేశ, విదేశీ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. సాగు చట్టాల విషయంలో రైతులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వారు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆక్షేపించారు. అయితే, రైతు ఉద్యమానికి లభిస్తున్న మద్దతును ఎలాగైనా తగ్గించాలనీ, ఉద్యమాన్ని తక్కువచేసిన చూపించాలని మోడీ సర్కారు ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. ఇందుకు బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌లు కుయుక్తులతో ముందుకెళ్తున్నాయని తెలిపారు.
వివాదాస్పద మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించిన రైతులు.. ఏప్రిల్‌లో నిరసనలను ఉధృతం చేయాలని భావిస్తున్నారు. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు తన సొంత ప్రయోజనాల కోసం ఆరాటపడుతోందనీ.. రైతులు, వారి డిమాండ్ల పట్ల కనీసం దృష్టిని కూడా సారించడంలేదని రాజకీయ నిపుణులు వివరించారు. ఇందుకు 'ఆర్థిక' అంశాలను చర్చకు తీసుకొచ్చి రైతు ఉద్యమంపై ప్రజల్లో వ్యతరేకత పెరిగేలా బీజేపీ, ఆరెస్సెస్‌లు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని చెప్పారు. రైతుల ఉద్యమం దేశప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నదనీ, ఇది కొని శతృదేశాలు, విదేశీ సంస్థల, ఉగ్రవాద సంస్థ, దేశంలోని ప్రతిపక్ష రాజకీయపార్టీల ఎత్తుగడలో భాగమంటూ ప్రజలను ఒప్పించే ప్రయత్నాలను బీజేపీ-ఆరెస్సెస్‌లు చేస్తున్నాయన్నారు.
ఇప్పటికే ఇవి రైతుల ఆందోళనలపై విషప్రచారాన్ని కొనసాగిస్తున్నాయని రైతులు, రాజకీయ నిపుణులు ఆరోపించారు. ఇందుకు సామాజిక మాధ్యమాలను ఆయుధంగా వాడుకొంటూ రైతు ఉద్యమంపై దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని తెలిపారు.
అయితే, మోడీ ప్రభుత్వం తప్పుగా ఆలోచిస్తున్నదనీ, అది బీజేపీకే తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రైతు సంఘాల నాయకులు చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయనీ, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ రైతు సంఘాల నాయకులు ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అయితే, ఎప్పటిలాగే ఎన్నికల్లో హిందూత్వ అజెండా పనిచేస్తుందని భావిస్తున్న బీజేపీ, ఆరెస్సెస్‌లకు ఐదు రాష్ట్రాల ఓటర్లు షాక్ ఇవ్వనున్నారనీ, రైతు ఉద్యమానికి, తాము చేస్తున్న ప్రచారానికి దేశంలోని రైతులు, సామాన్య ప్రజల నుంచి వస్తున్న ఆదరణే ఇందుకు తార్కాణమని రాజకీయ నిపుణులు, రైతు సంఘాల నాయకులు వివరించారు.