Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారు వచ్చాక పెరిగిన గుజరాతీల సంపద
- మరో రెండేండ్లలో రిలయన్స్‌ను దాటనున్న అదానీ గ్రూప్
2014లో మోడీ అధికారంలోకి వచ్చాక గుజరాతీలకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో గుజరాతీలే అధికంగా ఉంటే.. కార్పొరేట్ రంగంలోనూ ఆ రాష్ట్రానికి చెందిన దిగ్గజాలు ముకేశ్ అంబానీ, అదానీలే వ్యాపార సామ్రాజ్యాలను శాసిస్తున్నారు. రాఫెల్ విమానాల కొనుగోలులోనూ కేంద్రం అనిల్ అంబానీని భాగస్వామిగా పెట్టింది. కోట్లు ఎగనామంపెట్టిన అతడిని రాఫెల్ విమానాల భాగస్వామిగా పెట్టి.. మెహర్బానీ చాటుకున్నది మోడీ సర్కార్. తాజాగా మరో మూడు రాఫెల్ విమానాలు ఫ్రాన్స్‌నుంచి చేరుకోనున్నాయి. ఇక యూనివర్సిటీలతో సహా.. ఎన్నో విధాలుగా ముకేశ్ అంబానీకి కేంద్రం సహకరిస్తున్నది. తాజాగా అదానీకి విద్యుత్, ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలు ఇలా కోట్ల సామ్రాజ్యానికి దారులు కల్పిస్తున్నది. వీరిద్దరి మధ్య ఉన్న రేస్ చూస్తే.. 2023-24 నాటికి రిలయన్స్ సంస్థను అదానీ గ్రూప్స్ దాటిపోవటం ఖాయమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
ముంబయి : ఈ రోజు గడిస్తేచాలను కుంటారు పేదలు. భారమవుతున్న బతుకుల్ని ఎలా నెట్టుకు రావాలా అన్న ఆలోచనలో ఉంటారు మధ్య తరగతి జనం. ఇక కుబేరులు మాత్రం అధికా రంలో ఎవరున్నా.. తమ వ్యాపార సామ్రాజ్యాలను మరింతగా విస్తరించుకుంటూనే ఉన్నారు. గుజరాత్ నుంచి దేశ ప్రధానిగా ఉన్న మోడీ తన హయాంలో ఆ రాష్ట్ర కుబేరులకు కావాల్సి నంతగా సహకరిస్తున్నారనటానికి ఎన్నో సాక్ష్యాలు. మరెన్నో ఆధారాలు. దేశానికి ఏ ప్రధాని / దేశా ధ్యక్షుడు వచ్చినా గుజరాత్‌కు తీసుకెళ్లటం ఒక్కటేకాదు ఆ రాష్ట్ర అభివృద్ధికి కోట్లు వెచ్చిస్తు న్నారనీ, మిగతా రాష్ట్రాలను పట్టించుకోవటంలేదని తెలంగాణ మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ తరచూ అంటూనే ఉన్నారు. ఇది నాణేనికి ఓవైపు.. మరోవైపు దేశరాజకీయాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకునే కార్పొరేట్లు.. అందులో గుజరాతీయులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద మోడీ వచ్చాక గణనీయంగా పెరిగిందని సర్వేలు ధ్రువీకరిస్తున్నాయి. తాజాగా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం, ప్రస్తుతం ముకేశ్ అంబానీ సంపద.. నికర విలువ రూ.6.05 లక్షల కోట్లు. అదానీ సంపద విలువ రూ.2.34 లక్షల కోట్లు. అదానీ గ్రూపు కంపెనీలు మంచి వృద్ధి సాధించాయి. దీంతో అదానీ గ్రూపు నికర విలువ జులై 2020 నుంచి మార్చి 2021 మధ్య 67 శాతం పెరిగింది. అదే సమయంలో ముకేశ్ అంబానీ సంపద స్వల్పంగా (8శాతం) తగ్గింది.
అదానీ ఆదాయాలు అంత స్పీడ్‌గా పెరగటం వెనుక...
2014లో మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ముకేశ్ అంబానీ, అదానీ కంపెనీలు ఊహించని వృద్ధిని నమోదు చేశాయి.. 2014-2019లో ముకేశ్ అంబానీ నికర విలువ 130.58 శాతం పెరిగిందనీ, అదే సమయంలో గౌతమ్ అదానీ నికర విలువ 114.77 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. కాగా 2016లో రిలయన్స్ జియో ప్రారంభిం చాక ముకేశ్ అంబానీ వ్యాపారసామ్రాజ్యం వృద్ధికి ప్రధానకారణమైందని నివేదికలు చూపుతున్నాయి. కాగా, ప్రభుత్వరంగసంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసి, జియోకు మోడీ ప్రభుత్వం అండదండలిచ్చిన విషయం జగమెరిగిన సత్యమే.
2019 తర్వాత అదానీ గ్రూప్‌లో వేగం
మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి(2019)లో వచ్చాక.. గౌతమ్ అదానీ గ్రూప్ వృద్ధిలో వేగం పుంజుకున్నది. 2019-2021 మధ్య అదానీ గ్రూప్ నికర విలువ 147.72 శాతం పెరిగింది. అదే సమయంలో, పోల్చి చూస్తే, అంబానీ గ్రూప్ యొక్క నికర విలువ 59.15 శాతం పెరిగింది. అంటే.. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముకేశ్ అంబానీ నికర విలువ 267 శాతం, గౌతమ్ అదానీ నికర విలువ 432 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
కేవలం రెండు మూడేండ్లలోనే..
అంబానీ గ్రూప్ వృద్ధిలో వేగం ఉన్నప్పటికీ, అదానీ సంపద కంటే నెమ్మదిగా ఉన్నది. అదానీ శక్తికి ఇంధన సంస్థలే ఆక్సిజన్.. 2018 తరువాత, ఇంధన రంగంలో ఉన్న అదానీ పవర్, అదానీ గ్రూప్, అదానీ గ్యాస్ వంటి సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. అదానీ యొక్క వెల్డ్ క్రియేషన్‌కు ఇంధనశక్తి, గ్యాస్ వ్యాపారాలు గత రెండేండ్లలో విపరీతంగా పెరిగాయి. ఇదే అదానీ ఆదాయలు పెరగటానికి కారణం.
- హురున్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనుస్ రెహమాన్ జునైద్