Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్ర కరోనా .. తాజాగా 459 మరణాలు నమోదు
- 1.22 కోట్లకు చేరుకున్న బాధితులు.. 1.62 లక్షలకు పైగానే మృతుల సంఖ్య
న్యూఢిల్లీ : భారత్‌లో మరోసారి విజృంభిస్తున్న కరోనా వైరస్.. రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నది. గురువారం దేశంలో 72 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు 450కి పైగా రికార్డయ్యాయి. గతేడాది అక్టోబర్ 11 తర్వాత ఒక్కరోజులో అధికస్థాయిలో కేసులు ఇదే కావడం గమనార్హం.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో గురువారం 72,330 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1.22 కోట్లకు చేరుకున్నది. తాజా కరోనా మరణాల సంఖ్య 459గా రికార్డయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1.62 లక్షలకు పైగా చేరుకున్నది. అలాగే యాక్టివ్ కేసులు సంఖ్య వరుసగా 22వ రోజూ పెరిగింది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,84,055గా ఉన్నది.
మూడో దశ వ్యాక్సినేషన్ షురూ
భారత్‌లో కరోనా విజృంభిస్తున్న వేళ మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 45 ఏండ్లు పైబడిన ప్రజలకు ఈ టీకాను అందించనున్నారు. దేశంలో ఇప్పటి వరకు 6.51 కోట్లకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు.
మహారాష్ట్రలో తీవ్రం
మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. బుధవారం నాడు రాష్ట్రంలో 39,544 కొత్త కేసులు రికార్డయ్యాయి. అయితే, మంగళవారం నమోదైన కేసులతో (27,918 కేసులు) పోల్చుకుంటే బుధవారం 12వేల కేసులు అదనంగా నమోదుకావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసులు 28లక్షలకు పైగా చేరుకున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. మంగళవారం 992గా ఉన్న కొత్త కేసుల సంఖ్య బుధవారం నాటికి 1819కి చేరుకోవడం గమనార్హం.
ఇక కరోనా మహమ్మారి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తున్నది. ఒక్క మార్చి నెలలోనే కర్నాటక రాజధాని బెంగళూరులో దాదాపు 500 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా తేలడం భయాందోళనలను కలిగిస్తున్నది. కర్నాటకలో 4,225 కొత్త కరోనా కేసులతో మొత్తం సంఖ్య 9.97 లక్షలకు, 26 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 12,567కు చేరుకున్నాయి. కొన్ని నిబంధనలు, మినహాయింపుల కలయికతో తమిళనాడులో కరోనా లాక్డౌన్ ఈనెల 30 వరకు కొనసాగనున్నది.
ప్రపంచవ్యాప్తంగా...
ఇక ప్రపంచదేశాలను హడలెత్తిస్తూ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతున్నది. జాన్స్ హౌపికిన్స్ యూనివర్సిటీ ట్రాకర్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 12.87 కోట్లకు పైగా కరోనా బారిన పడ్డారు. 28.14 లక్షల మంది మృతి చెందారు. 7.30 కోట్ల మంది ఈ వ్యాధి నుంచి రికవరీ అయ్యారు. ఇక ఫ్రాన్స్‌లో మూడు వారాల పాటు పాఠశాలల మూసివేతకు ఆదేశించారు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్. అలాగే దేశీయ ప్రయాణాలపై ఒక నెల పాటు నిషేదం విధించారు.
తెలంగాణలో తీవ్రంగా...
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా విజంభిస్తున్నది. కొత్తగా 887 కేసులు నమోదు కాగా.. నలుగురు మతి చెందినట్టు గురువారం వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,08,776 కరోనా కేసులు ఉండగా.. 1,701 మరణించారు. ప్రస్తుత్తం రాష్ట్రంలో 5,511 యాక్టివ్ కేసులు ఉన్నాయనీ, కోవిడ్ నుంచి ఇప్పటి వరకు 3,01,564 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక జిల్లాల వారీగా చూసినప్పుడు బుధవారం నుంచి గురువారం వరకు 24 గంటల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే 201 కేసులు నమోదు కావటంతో నగర ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మేడ్చల్ 79, నిర్మల్ 78, రంగారెడ్డి 76, జగిత్యాల 56, నిజామాబాద్ 45, సంగారెడ్డిలో 36 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిజాగ్రత్తలు పాటించాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.