Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 125వ రోజుకు రైతు ఉద్యమం
- హర్యానా డిప్యూటీ సీఎం ఎదుట అన్నదాతల ఆందోళన.. నల్లజెండాలతో నిరసనలు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌చేస్తూ రైతన్నలు చేస్తున్న ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన గురువారం నాటికి 125వ రోజుకు చేరింది. హస్తిన సరిహద్దులైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్, షాజహాన్‌పూర్, పల్వాల్ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం కొనసాగుతున్నది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కిసాన్ మహా పంచాయతీలు, యాత్రలు, జాతాలు నిర్వహిస్తున్నారు. హర్యానాలోని హిసార్‌లో డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా నివాసం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. అలాగే దుష్యంత్ చౌతాలా రాష్ట్రానికి వస్తున్న సమాచారం తెలుసుకున్న రైతులు హిసార్ ఎయిర్ పోర్టు ఎదుట కూడా నిరసనకు దిగారు. ఎయిర్‌పోర్టులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రైతులను అడ్డుకున్నారు. రోడ్డుపైనే బైటాయించి అన్నదాతలు ఆందోళన కొనసాగించారు. రోడ్డు మొత్తాన్ని రైతులు దిగ్బంధించారు. మరో ఎనిమిది నెలలకు పైగా ఆందోళన కొనసాగుతుందని రైతు నేత రాకేశ్ తికాయత్ అన్నారు. రైతుల హక్కులు, భూమి ప్రశ్నార్థకమైయ్యే మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగుతున్నదనీ, ఆ చట్టాలను రద్దు చేసి, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించేంత వరకు ఢిల్లీ సరిహద్దుల నుంచి కదలేదిలేదని స్పష్టం చేశారు.