Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగం నుంచి తొలగించిన కాలేజీ యాజమాన్యం
న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్‌లాల్ ఆనంద్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జిఎన్.సాయిబాబాను అధికారులు ఆ పదవి నుంచి తొలగించారు. ఆమె కుమార్తె మంజీర ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆయన్ని తొలగిస్తున్నట్టుగా గురువారం తమకు లేఖ అందిందని చెప్పారు. 90శాతం వైకల్యంతో వీల్‌ఛైర్‌కే పరిమితమైన సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2017లో యావజ్జీవం విధించారు. అప్పటి నుండి నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో వున్నారు. ఫిబ్రవరి 13న ఆయనకు కరోనా సోకింది. 2014లో అరెస్టయ్యేంతవరకు సాయిబాబా కాలేజీలో ఆంగ్లం బోధించేవారు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ విషయమై పరిశీలించేందుకు ఏకసభ్య కమిటీని కాలేజీ వేసింది. పదవి నుంచి తొలగించడానికి గల కారణాలు తెలుపుతూ లేఖతో పాటు ఎలాంటి పత్రాలు పంపలేదని మంజీర చెప్పారు. ఈ లేఖపై కోర్టుకు వెళ్ళనున్నట్టు ఆమె తెలిపారు. తొలగింపు ఉత్తర్వులు మార్చి 31 నుంచి అమల్లోకి వవచ్చాయన్నారు. మూడు మాసాల వేతనాన్ని సాయిబాబా ఖాతాలో వేశారని ఆ లేఖలో తెలిపారు. కాలేజీకి రాకుండా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ అరెస్టయిన వెంటనే ఆయనపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు. కాలేజీ కమటీతో తమ న్యాయవాది మాట్లాడుతూనే వున్నారని, తమకు ఇవ్వని పత్రాల కోసం ఆరు మాసాల క్రితమే వారికి ఒక లేఖ కూడా రాశామని తెలిపారు. అప్పటి నుండి వారి నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఆయన కాలేజీకి హాజరు కాలేని పరిస్థితుల్లో వున్నపుడు వారు ఆ కారణాన్ని ఉపయోగించరాదని తాము తెలియచేశామన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ తొలగింపు లేఖను అందచేశారని చెప్పారు. సాయిబాబా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయనను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ గత నెల్లోనే మానవ హక్కుల గ్రూపులు, పౌర హక్కుల సంఘాలు, అంతర్జాతీయ విద్యావేత్తల సమాఖ్యలు కోరాయి.