Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పంట చేతికొచ్చిన తర్వాత అమ్ముకుంటే... కేజీ ధర వందో, రెండొందలో పలుకుతుంది. కానీ ఈ పంట కేజీ అక్షరాలా లక్ష రూపాయలు పలుకుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంటగా పేరుగాంచింది. దీన్ని ఎక్కువగా ఐరోపాలో పండిస్తారు. ఇప్పుడు తాజాగా మన దేశంలో బీహార్‌లో ఓ వ్యక్తి సాగు చేశారు. ఔరంగాబాద్ జిల్లాలోని కర్మనిధ్ గ్రామానికి చెందిన అమరేశ్ సింగ్ (38) ఈ పంటను పండించారు. ఈయన వ్యవసాయంపై మక్కువతో తనకున్న 1500 సెంట్ల భూమిలో వినూత్నమైన పంటలు సాగు చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలను సంప్రదించారు. ఆ శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు రెండు నెలల క్రితం హాప్ షూట్స్ అనే పంటను సాగు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పంట 60 శాతం వరకు పూర్తయ్యింది. ఈ పంటకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఆరేళ్ల క్రితమే కిలో వెయ్యి పౌండ్లు ధర పలికింది. ఈ ధర ప్రకారం ప్రస్తుతం కిలో హాప్ షూట్స్ ఖరీదు రూ. లక్ష ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హాప్ షూట్స్ ప్రత్యేకత ఏంటీ?
అత్యంత ఖరీదైన హాప్ షూట్స్‌లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటి పూలు, పండ్లు, కాడలను యాంటీబయాటిక్స్ వంటి ఔషధాల తయారీలో వినియోగిస్తారు. హాప్ షూట్స్‌తో తయారుచేసిన ఔషధాలు టీబీ వంటి వ్యాధుల నియంత్రణకు మెరుగ్గా పనిచేస్తాయి. ఈ మొక్కల్లో ఉండే హ్యుములోన్స్, ల్యూపులోన్స్ అనే ఆమ్లాలు.. క్యాన్సర్ కణాలను నిర్మూలించేందుకు ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉన్నందున ఐరోపా వాసులు సౌందర్య సాధనంగానూ వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే, క్రమక్రమంగా ఇది కూరగాయల పంటగా కూడా ప్రసిద్ధి చెందింది. కొంచెం చేదుగా ఉంటుంది. అయినా నేరుగా తినొచ్చు. 'భారతీయ రైతులు ఈ పంట వైపు మొగ్గుచూపితే.. ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు' అని ఐఏఎస్ అధికారి సుప్రియా సాన్హూ ట్వీట్ చేశారు.
ఎండాకాలం ఈ పంట సాగుకు అనువైన సమయం. మార్చి నుంచి జూన్ మధ్యలో హాప్‌షూట్స్ సాగును ప్రోత్సహిస్తారు. తగినంత తేమ, సూర్యరశ్మి ఉంటే చాలు... మొక్కలు వేగంగా పెరుగుతాయి.