Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాది దాటినా సీబీఐ చార్జిషీట్ వేయలేదు: వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె
న్యూఢిల్లీ: తన తండ్రి హత్య కేసులో కొంత మంది కుటుంబ సభ్యులపై అనుమానం ఉందని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్య ఘటనలో తప్పు జరిగిందని షర్మిలకు తెలుసునని అన్నారు. హైకోర్టు ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించి ఏడాది దాటినప్పటికీ, సిబిఐ ఎటువంటి చార్జీషీట్ దాఖలు చేయలేదని తెలిపారు. న్యాయం కోసం అందరి తలుపులు తట్టానని, రాష్ట్రపతి మొదలు అందరి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఎప్పటికప్పుడు సిబిఐ, పిఎంఒ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులను కలుస్తున్నానని, అయినా న్యాయం అందలేదని, ఇంకెన్నాళ్లు న్యాయం కోసం వేచి చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్ర వారం నాడిక్కడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో సునీత మాట్లాడారు. తన తండ్రి హత్య రాజకీయ ప్రేరేపితమని, తమ కుటుంబంలోని కొంత మంది వ్యక్తులపై అనుమానం ఉందని అన్నారు. కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, బిజెపి నేత ఆదినారాయణ రెడ్డిలతోపాటు మరో 11 మంది పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ అనుమానితుల పేర్లను ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్నాన్నను హత్య చేస్తే ఇంత వరకు ఒక్క నిందితున్ని పట్టుకోలేదని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పటికీ విచారణ ఎందుకు ఆలస్యంగా జరుగుతుందో ప్రభుత్వాన్నే అడగాలని, ప్రభుత్వం సమాధానం ఇస్తే తనకు బయటకు వచ్చే అవసరం ఉండేది కాదన్నారు. సిబిఐ విచారణ కావాలని సిఎం అడిగారని, కానీ తరువాత సిఎం పట్టించుకోలేదని అన్నారు. దర్యాప్తు ఆలస్యం అయ్యేకొద్ది సాక్షులకు హాని కలుగుతోందేమోనని భయమేస్తోందన్నారు.