Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ రెండోవారంలో పీక్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రెండో దశ తీవ్రంగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 80 వేలు దాటింది. దేశంలో సెకండ్ వేవ్ మార్చి నెలలో ప్రారంభమైనట్టు గుర్తించారు. ఏప్రిల్ నెల రెండో వారం తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలా కొనసాగుతూ మే చివరి నాటికి వైరస్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.దేశంలో కరోనా తొలి దశ ఉధృతి కొనసాగిన సమయంలో వైరస్ తీవ్రతను సూత్రా అనే గణాంక పద్ధతి ద్వారా కాన్పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2020 సెప్టెంబర్ నెలలో వైరస్ తీవ్రత గరిష్ఠానికి చేరుకొని.. 2021 ఫిబ్రవరి నాటికి తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అదే తరహాలో ప్రస్తుతం రెండో దశ కోవిడ్ తీవ్రతను కూడా అంచనా వేస్తున్నారు.
'ప్రస్తుతం దేశంలో పెరుగుతోన్న కరోనా కేసుల తీరును చూస్తే ఏప్రిల్ 15-20వ తేదీ మధ్యకాలంలో గరిష్టానికి చేరే ఛాన్స్ ఉన్నది.అదే తీరుతో కాస్త తగ్గుముఖం పడుతూ.. మే చివరి నాటికి గణనీయంగా తగ్గుతుంది' అని అధ్యయనంలో పాల్గొన్న ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్రా అగర్వాల్ పేర్నొన్నారు. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువైందనీ.. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగి.. చివరకు తగ్గుముఖం పడుతుందన్నారు. ఇప్పుడున్న తీవ్రతను బట్టి చూస్తే మహారాష్ట్ర, ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని అంచనా వేశారు. రాష్ట్రాల వారీగా కేసుల్లో తేడా ఉన్నప్పటికీ ఏప్రిల్ రెండో వారం నాటికి వైరస్ ఉధృతి గరిష్టానికి చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు. హర్యానాలోని అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మేనన్ అంచనా ప్రకారం కూడా ఏప్రిల్, మే నాటికి వైరస్ విజృంభణ అధిక స్థాయికి చేరుకుంటున్నట్టు వెల్లడించారు.