Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్రమంపై పోస్టు చేసినందుకు త్రిపురలో ఫిజియోథెరపిస్టు సస్పెండ్
న్యూఢిల్లీ : టెండర్ ప్రక్రియ లేకుండా త్రిపురలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన అక్రమం గురించి పేస్‌బుక్‌లో పోస్టుచేసిన వైద్యురాలిని ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేశారు. అనిందిత భౌమిక్ అనే ఫిజియోథెరపిస్టు త్రిపుర మెడికల్ కాలేజ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ టీచింగ్ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. టెండర్ ప్రక్రియ లేకుండా ఖరీదైన యంత్రాలను కొనుగోలు చేశారని ఆరోపిస్తూ ఆమె గతనెల 24న పోస్టు పెట్టారు. టెండర్ పిలవకుండా.. ఒఎస్‌డి అనైతికంగా, అక్రమంగా ఒక ప్రయివేట్ పార్టీకి టెండర్ ఇచ్చేశారని భౌమిక్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం తనను పిలిచి.. పోస్టును తొలగించాలని ఒత్తిడి చేసిందని తెలిపారు. ఈ మొత్తం పరిణామాలపై భౌమిక్ ' ది వైర్' అనే వార్తా సంస్థతో మాట్లాడుతూ.. 2018లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. ఇటువంటి పరిస్థితులను తాను ఇంతకుముందున్నడూ చూడలేదని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆధారంగా తనను సస్పెండ్ చేశారని విమర్శించారు. అనిందిత భౌమిక్ దక్షిణ త్రిపుర జిల్లాలోని బెలోనియా సబ్‌డివిజన్‌కు చెందిన పాలక బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ చంద్ర భౌమిక్ కుమార్తె కావడం గమనార్హం. పోస్టు నుంచి తొలగించేందుకు తనపై యాజమాన్యం ఒత్తిడి తేవడంతో పాటు బెదిరింపులకు కూడా పాల్పడిందని అనిందిత భౌమిక్ పేర్కొన్నారు. ' నాతండ్రిని పిలిచి పోస్టు తొలగించేలా నన్ను ఒప్పించాలని కోరారు. అయితే అందుకు నేను తిరస్కరించడంతో చివరకు అధికారులు గతనెల 27న సస్పెండ్ చేశారు' అని తెలిపారు.