Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తూ కేరళకు చెందిన ఇద్దరు నన్స్(క్రైస్తవ సన్యాసినులు), మరో ఇద్దరు యువతులపై బెదిరింపులు చేసిన కేసులో రైల్వే పోలీసులు ఇప్పటి వరకు ఏబీవీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు 13 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ రైల్వేస్టేషన్ ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతులను బలవంతంగా మతమార్పిడి చేసేందుకు నన్స్ తీసుకెళ్తున్నారని ఆరోపిస్తూ వారిని రైలు నుంచి దించివేసిన విషయం తెలిసిందే. వారిని దాదాపు నాలుగు గంటల పాటు రైల్వేస్టేషన్లో కూర్చోపెట్టారు. దీనిపై పేరు చెప్పేందుకు ఇష్టపడని సీనియర్ జీఆర్పీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నలుగురు యువకులను విచారించాలా వద్దా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్న రైల్వేస్ ఎస్పీ కార్యాలయం 'ఆలస్యం చేసే వ్యూహాలను(డిలేయింగ్ టాక్టిక్స్)ను అవలంభిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో కాల్స్ ద్వారా బాధిత మహిళల స్టేట్మెంట్ను రికార్డు చేశారని తెలిపారు. రైలులో యువకులు తమను బెదిరించడంతో పాటు దూషించారని, ఇందుకు ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఉన్నట్లు చెప్పారని ఆ అధికారి పేర్కొన్నారు. మత సమూహాల మధ్య విధ్వేషాన్ని రెచ్చగొట్టినందుకు ఏబీవీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేయడమే కాకుండా.. మూడేండ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా వారి ఫిర్యాదుపై తొందరపడి స్పందించిన జీఆర్పీ అధికారులపై కూడా డిపార్ట్మెంటల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం కావాలనే ఈ కేసు విచారణను ఆలస్యం చేస్తోందని ఝాన్సీ మాజీ కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ జైన్ విమర్శించారు.