Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీని కోరిన సీపీఐ(ఎం)
- ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ
న్యూఢిల్లీ : కేరళ నుంచి జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఒక లేఖ రాశారు. చట్ట ప్రకారం ఎన్నికల కమిషన్ వ్యవహరించాలని, ప్రస్తుతమున్న సభ్యుల కాల పరిమితి ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర రాజ్యాంగ సంస్థ పారదర్శకంగా వుండాలంటే ప్రభుత్వ ప్రస్తావనకి సంబంధించిన వివరాలను బహిరంగపరచాలని కోరారు. మార్చి 25న ఇదే విషయమై లేఖ రాసి ఆ మరుసటి రోజే ఈసీతో సమావేశమైన బసు తాజాగా శుక్రవారం మరో లేఖ రాశారు. కేరళ రాజ్యసభ ఎన్నికలపై జరుగుతున్న తాజా పరిణామాలు తమ ఆందోళనలను మరింత ధ్రువీకరిస్తున్నాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ చేసిన ప్రస్తావన ఆధారంగా ఎన్నికలను నిలుపుచేయాలనుకుంటున్నారా లేదా తెలియచేయాలని కోరుతూ తాము గతంలో ఒక లేఖ రాశామని చెప్పారు. అయితే, ప్రభుత్వ ప్రస్తావన తెలియచెప్పడానికే తప్ప ఎన్నికల క్రమం నిలుపుచేసే ఉద్దేశంతో కాదని గత నెల 24 ఇసి తెలియచేసిందని బసు గుర్తు చేశారు. కానీ, ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ను దెబ్బతీసేలా కమిషన్ చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వ ప్రస్తావనలో ఏముందో పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి ఇసి తిరస్కరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. కేరళ హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో వున్న సమయంలో కమిషన్ తీసుకున్న వైఖరితో తీవ్ర పర్యవసానాలు వుంటాయి. ప్రస్తుతమున్న సభ్యుల గడువు ముగిసేలోగా ఎన్నికలు జరుగుతాయని మౌఖికంగా చెబుతున్నప్పటికీ ఈ మేరకు స్పష్టంగా ఒక ప్రకటన చేయడానికి కమిషన్ ఎందుకు తిరస్కరిస్తోందో అర్ధం కావడం లేదన్నారు. షెడ్యూల్‌ను ప్రకటిస్తూ మార్చి 17 నోటిఫికేషన్లో వ్యక్తం చేసిన వైఖరి మారిపోయినట్లుగా కనిపిస్తోందన్నారు. పైగా ప్రభుత్వ ప్రస్తావనలోని సమాచారాన్ని పంచుకోవడానికి కూడా కమిషన్ తిరస్కరించడం తమ ఆందోళనలను మరింత పెంచుతోందని బసు ఆ లేఖలో పేర్కొన్నారు.
అందువల్ల చట్ట ప్రకారం ఎన్నికల కమిషన్ వ్యవహరించాలని, గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుతున్నామని బసు చెప్పారు. అలాగే, ఎన్నికల కమిషన్ వంటి స్వతంత్ర రాజ్యాంగ సంస్థ పారదర్శకంగా వుండాలంటే ఆ ప్రభుత్వ ప్రస్తావనలోని వివరాలను బహిరంగపరచాలని బసు కోరారు. కమిషన్ స్వతంత్ర వైఖరికి భంగం కాని రీతిలో వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.