Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలుష్యంబారిన 64శాతం వ్యవసాయ భూమి
- హైరిస్క్‌లో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు : తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : పంటల సాగులో పురుగుమందుల వాడకం ప్రపంచ పర్యావరణా నికి, మానవాళి ఆరోగ్యానికి ఊహించని ముప్పు తెచ్చిపెడుతోందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. వ్యవసాయరంగంలో పెద్దఎత్తున వాడుతున్న పురుగుమందులు పర్యావరణలో కాలుష్య కారకాల్ని పెంచుతోందని అధ్యయనం తెలిపింది. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నికి చెందిన శాస్త్రవేత్తలతో కూడిన బృందం ఈ అధ్యయాన్ని జరిపింది. 168దేశాల్లో శాస్త్రవేత్తల బృందం పరిశోధన నిర్వహించింది. దీంట్లో పరిశోధకులు తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పురుగుమందుల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాల వల్ల ప్రపంచంలో 64శాతం వ్యవసాయ భూమి ప్రమాదంలో పడిపోయింది. ఇందులో 31శాతం భూమి హైరిస్క్‌లో ఉందని పరిశోధకులు అంచనావేశారు.
ఆసియాలోని చైనా, ఇండియా, జపాన్, మలేసియా, ఫిలిప్పైన్స్..తదితర దేశాల్లో వ్యవసాయ భూమి పురుగుమందుల కాలుష్యంబారిన పడే ప్రమాదం ఎక్కువగా ఏర్పడింది. ఇందులో జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్న 34శాతం భూభాగాలకు ప్రమాదం పొంచివుంది. పురుగుమందుల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు కేవలం మానవుల ఆరోగ్యం, పర్యావరణంపైనే కాదు, వ్యవసాయ భూమిపైనా ఉందని పరిశోధకుల్లో ఒకరైన ఫియోనా టాంగ్ చెప్పారు. భూమి ఉపరితలం, భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నాయని, అలాగే నీటి ఆవాసాలూ దెబ్బతింటాయని టాంగ్ అన్నారు. దీనివల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆయన హెచ్చరించారు.