Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2007 నందిగ్రామ్ హింస వెనుక మమత, సువేందు : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : నందిగ్రామ్ 2007 నాటి హింస వెనుక మమతా బెనెర్జీ, నమ్మిన బంటు సువేందు అధికారి, ఆర్ఎస్ఎస్, జాతీయ అతివాదులున్నారనే అనే అనుమానాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఆనాడు సీపీఐ(ఎం) నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రతిపక్ష నేతగా ఉన్న మమతా బెనెర్జీ, సువేందు అధికారి, ఆర్ఎస్ఎస్ నాయకులు చేతులు కలిపారని, పెద్ద ఎత్తున హింసకు కుట్ర పన్నారని తేలిపోయింది. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి, ఆయన తండ్రి సిసిర్ అధికారి నందిగ్రామ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన బాధ్యులని సీఎం మమతా బెనెర్జీ ఇటీవల ఆరోపించారు. నందిగ్రామ్‌లో పోలీసు కాల్పులు, అమాయక పౌరుల మరణాలు..ఇవన్నీ మమతా బెనెర్జీకి తెలిసే జరిగాయని సువేందు అధికారి ప్రత్యారోపణలు చేస్తున్నారు.
10 ఏండ్ల తర్వాత నిజాలు బయటకొస్తున్నాయి : ఏచూరి
ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో సీఎం మమతా బెనెర్జీ, బీజేపీ నాయకుడు సువేందు అధికారి మాటలు, ఆరోపణలు విన్నాక, నందిగ్రామ్ హింస వెనుక ఎవరున్నారో తేలిపోయిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్, మమతా బెనెర్జీ, సువేందు అధికారి...మొదలైనవారంతా నందిగ్రామ్ హింస వెనుకున్నారని, దశాబ్దకాలం తర్వాత అసలు నిజాలు బయటకొస్తున్నాయని ఏచూరి అన్నారు. దీనికి మమతా, సువేందు అధికారి వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు.
'' నందిగ్రామ్ హింసలో మమతా బెనెర్జీ పాత్ర ఏమేరకు అన్నది సువేందు అధికారి స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్క బుల్లెట్టూ ఆమెకు తెలిసే దూసుకెళ్లిందని సువేందు అధికారి చెప్పారు. ఆనాటి హింస అంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని మేం అనుమానం వ్యక్తం చేశాం. అది నిజమని ఇప్పుడు తేలిపోయింది'' అని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయంలో నందిగ్రామ్‌లో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుందని, సాధారణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదని, దీనిపై ఎన్నికల సంఘం నిశ్శబ్దంగా ఉందని ఏచూరి వ్యాఖ్యానించారు.