Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు అధికారులపై ఈసీ వేటు
- అసోంలోని ఒక పోలింగ్ కేంద్రంలో రీకౌంటింగ్‌కు ఆదేశం
న్యూఢిల్లీ : బీజేపీ అభ్యర్థికి చెందిన కారులో ఈవీఎంలు తరలించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అసోంలోని రతబరి నియోజకవర్గంలోని కరీంఘంజ్ ప్రాంతంలో గురువారం పోలింగ్ అనంతరం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. రతబరి నియోజకవర్గానికి పక్కన ఉండే పాథార్కండి స్థానం నుంచి పోటీచేస్తున్న బీజేపీ నేత క్రిష్ణేందు పాల్‌కు చెందిన కారులో ఒక పోలింగ్ కేంద్రానికి చెందిన ఈవీఎంలను తరలిస్తున్నారన్న సమచారంతో స్థానికులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు తీసుకెళ్తున్నారన్న అనుమానంతో వారు కారును అడ్డుకొని రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులను నిలువరించేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో దీనికి బాధ్యత చేస్తూ ఎన్నికల సంఘం ప్రిసైడింగ్ అధికారితో సహా మొత్తం నలుగురిని సస్పెండ్ చేయడంతో పాటు రతబరి నియోజకవర్గంలోని 149-ఇందిరా ఎంవి స్కూల్ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్‌కు ఆదేశించింది. కరీంఘంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈసీ ఆదేశం మేరకు ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు గురువారం ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ప్రకారం.. అసోం రెండో విడత ఎన్నికల్లో భాగంగా గురువారం 39 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రతబరి నియోజకవర్గ పరిధిలోని 149-ఇందిరా ఎంవి స్కూల్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను సీల్ చేసి అధికారులు పోలీసుల భద్రత మధ్య బయలుదేరారు. భారీ వర్షం కారణంగా రోడ్డుపై బురద చేరడంతో పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. నీలం బజార్ సమీపానికి వచ్చే సరికి వారు వెళ్తున్న వాహనంలో రాత్రి 9 గంటల సమయంలో సమస్య తలెత్తింది. ఈ సమయంలో పైఅధికారులతో కొంత సంప్రదింపులు జరిపిన అనంతరం.. ఈవీఎంలను భద్రపరిచే ప్రాంతానికి వెళ్లేందుకు అటుగా వెళ్తున్న కారును లిఫ్ట్ అడిగి, 9.20 గంటల సమయంలో ఇవిఎంలతో సహా ఎక్కారని, అయితే ఆ సమయంలో ఆ కారు ఎవరిదన్న దాన్ని తెలుసుకోలేదని నివేదిక తెలిపింది. వారు ఎక్కిన కారు పాథార్కండి ఎమ్మెల్యే భార్య మధుమిత పాల్ పేరున రిజిస్ట్రేషన్ ఉంది. ఆ వాహనంలో ఉన్నవారిపై స్థానికులు కర్రలతో దాడి చేశారు. ఈ వాహనం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి క్రిష్ణేందు పాల్‌కు చెందినదని, ట్యాంపరింగ్ చేసేందుకు ఈవీఎంలను తీసుకెళ్తున్నారని స్థానికులు ఆరోపించారు.