Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూఈఎఫ్
న్యూఢిల్లీ: స్త్రీ, పురుష సమానత్వం గురించి ప్రపంచ దేశాధినేతలతో పాటు మన దేశంలోనూ చాలా మంది నాయకులు అనేక సార్లు ప్రస్తావించారు. లింగ సమానత్వంలో మరింతగా దేశం దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. కానీ తాజాగా విడుదల చేసిన ఓ అధ్యయనం లింగ సమానత్వంలో భారత్ దారుణ స్థితిలో ఉందని పేర్కొంది. ప్రపంచదేశాలతో పోలిస్తే.. ఎక్కడో అట్టడుగు స్థానంలో అధ్వాన్న స్థితిలో ఉండటం స్త్రీ,పురుష సమానత్వంలో నెలకొన్న దారుణ స్థితికి అద్దం పడుతోంది. గ్లోబర్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఈ నివేదికలో 156 దేశాలకు చెందిన సమాచారాన్ని పొందుపరిచారు. పురుషులు-మహిళల మధ్య సమానత్వం చేరుకోవడానికి గత ఏడాది వరకు 99.5 సంవత్సరాల సమయం అవసరం అవగా.. అది ఇప్పుడు 135.6 సంవత్సరాలు పడుతుందని నివేదిక తెలిపింది. అంటే అంతరం ఏడాది పొడవునా సుమారు 36 ఏండ్లు పెరగడం ఆందోళన కలిగించే ఆంశం. ఆర్థిక భాగస్వామ్యం-అవకాశం, విద్యా స్థితి, ఆరోగ్యం-మనుగడ స్థితి, రాజకీయ సాధికారత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నివేదికను తయారు చేశారు. అత్యధికంగా లింగ అసమానత రాజకీయాల్లో ఉంది. రాజకీయాల్లో మహిళల సంఖ్య 22 శాతం మాత్రమే ఉన్నారు. 156 దేశాల పార్లమెంటు సభ్యులలో 35,500 మందిలో 26.1 శాతం మంది మహిళా ఎంపీలు ఉన్నారు. మొత్తం 3,400 మంది మంత్రులలో 22.6 శాతం మంది మహిళా మంత్రులు ఉన్నారు. ఆరోగ్య రంగంలో సమానత్వం అత్యధికంగా 96 శాతం మహిళలు ఉన్నారు. ఆర్థిక సమానత్వంలో మహిళల సంఖ్య 58 శాతంగా ఉన్నప్పటికీ, వారు పురుషులతో సమానంగా మారడానికి 267.6 సంవత్సరాలు పడుతుందని నివేదిక పేర్కొంది. ఇక విద్యారంగంలో 37 దేశాలు స్త్రీ-పురుష సమానత్వ స్థాయిని సాధించాయి.
ఇక భారత్‌లో రాజనీతిలో మహిళలు 22 శాతంతో 51వ ర్యాంకు, ఆర్థిక సమానత్వంలో 58 శాతంతో 151వ ర్యాంకు, విద్య రంగంలో 95 శాతంతో 114వ ర్యాంకు, ఆరోగ్య రంగంలో 96 శాతంతో 155వ ర్యాంకు సాధించింది. మొత్తం శ్రామిక శక్తిలో 22.3 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. అయితే, పురుషుని ఆదాయంలో 20.7 శాతం కంటే తక్కువగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. కాగా, లింగ సమానత్వంలో ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. గత 12 ఏండ్లుగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 90 శాతం సమానత్వం ఈ దేశం సాధించింది. లింగసమానత్వంలో నమీబియా, రువాండా, లిథునేమియా వంటి దేశాలు భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉండటమే కాకుండా టాప్-10 దేశాల్లో నిలవడం విశేషం.