Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెన్షన్ పథకంలో చేరుతున్నవారు చాలా తక్కువ
- పదికోట్ల మంది కార్మికులే లక్ష్యంగా స్కీంను తీసుకొచ్చిన కేంద్రం
- ఇప్పటి వరకు 50 లక్షల మంది కూడా చేరని పరిస్థితి
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి శ్రమ యోగి మాంధన్ (పీఎంఎస్వైఎం) పెన్షన్ పథకం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. దేశంలోని 10 కోట్ల మంది కార్మికులకు లబ్ది చేకూర్చేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం కింద అర్హులు ఆశించినస్థాయిలో చేరడం లేదు. 2019లో ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు (2021, మార్చి 31 వరకు) పీఎంఎస్వైఎం లో చేరిన వారు 50 లక్షలు కూడా దాటకపోవడం పథకం అమలుతీరుకు అద్దంపడుతున్నది.
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం ఉద్దేశించి ఈ పథకాన్ని 2019, ఫిబ్రవరిలో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 18-40 ఏండ్ల మధ్య ఉన్న ప్రతి కార్మికుడు ( నెల వేతననం రూ. 15వేల కంటే తక్కువగా ఉండాలి) ఈ పథకానికి అర్హులు. ఇందుకు వారు ప్రతినెలా కొంత మొత్తాన్ని (లబ్దిదారుడి వయసును బట్టి చెల్లించే మొత్తం మారుతుంది) చెల్లించాల్సి ఉంటుంది. దీంతో, వారికి 60 ఏండ్లు దాటిన తర్వాత నెలకు రూ.3వేల పెన్షన్ అందుతుంది.
కానీ, ఈ పథకం కింద కొత్తగా చేరుతున్నవారి సంఖ్య ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆశించినస్థాయిలో లేకపోవడం గమనార్హం. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఈ పథకంలో చేరినవారి సంఖ్య గతేడాది 15.91 లక్షలకు పైగా ఉన్నది. కానీ, 2020-21లో (మార్చి 31 నాటికి) అది 1.30 లక్షలుగానే ఉండటం గమనార్హం. 2019లో ఈ పథకం కింద మొత్తం 27.72 లక్షల మందికి పైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 2020 నాటికి అది 43.64 లక్షల మందికి పైగా చేరకున్నది. 2021, మార్చి 31 వరకు మాత్రం అది స్వల్పంగా పెరిగి 44.94 లక్షలుగా నమోదైంది.
అయితే ఈ పథకంపై మోడీ సర్కారు కార్మికుల్లో సరైన అవగాహన కల్పించకపోవడం కారణంగానే ప్రస్తుత పరిస్థితి నెలకొన్నదని ఆర్థికనిపుణులు అన్నారు. పథకాల ప్రచారార్భటంలో ఉన్న శ్రద్ధ.. అది ప్రజలకు చేరిందా? లేదా? అన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని తెలిపారు. ఈ పథకం సుదీర్ఘకాలానికి చెందినదై ఉండటం కారణంగానూ కార్మికులు అందులో చేరకపోవడానికి కారణమవుతున్నదని వారు వివరించారు.