Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదో తరగతి బాలికపై సామూహిక లైంగికదాడి
- బాధితురాలి ఆత్మహత్య
లక్నో : బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో మరో దారుణం చోటు చేసుకున్నది. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న బాలికను ఎత్తుకెళ్లి మరీ సామూహిక లైంగికదాడికి తెగబడ్డారు దుండగులు. అయితే, ఘటన అనంతరం ఇంటికి చేరుకున్న బాధితురాలు ఆత్మహత్యకు చేసుకున్నది. ఈ ఘటన మీరట్‌లో చోటు చేసుకున్నది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సార్ధన కొత్వాలీ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతున్నది. ఎప్పటిలాగే ట్యూషన్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్న తరుణంలో నలుగురు దుండగులు ఆమెను అడ్డగించారు. ఆమెను ఒక నిర్మానుశ్య ప్రదేశానికి ఎత్తుకెళ్లి అక్కడ ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. ఘటన అనంతరం దుండుగులు ఆమెను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. అతికష్టం మీద బాధితురాలు తన ఇంటికి చేరుకున్నది. జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది. బాధను తట్టుకోలేని సదరు బాలిక.. కొంత సమయానికి ఇంట్లో విషం తాగింది. ఈ విషయం గమనించిన బాలిక తల్లిదండ్రులు ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక చనిపోయిందని పోలీసులు తెలిపారు. కాగా, బాలిక సూసైడ్ నోట్లో పక్క గ్రామానికి చెందిన లఖన్, వికాస్ లతో పాటు మరో ఇద్దరి పేర్లను పేర్కొన్నదనీ, వారిద్దరి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని వివరించారు.