Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అది మా విజయావకాశాలను పెంచుతుంది
- ప్రధానికి ట్యాగ్ చేస్తూ డీఎంకే నేతల ట్వీట్లు
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు, ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి. అధికార ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి, ప్రతిపక్ష డీఎంకే-కాంగ్రెస్ కూటములకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో వేడిని రాజేస్తున్నారు. తాజాగా, రాష్ట్రంలో డీఎంకే అభ్యర్థులు కొన్ని రోజుల నుంచి ఆసక్తికర ట్వీట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ.. తమ ప్రత్యర్థులైన ప్రతిపక్ష ఏఐఏడీంకే అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలనీ, మోడీ ప్రచారం తమ విజయావకాశాలను పెంచుతుందని డీఎంకే నాయకులు వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ మేరకు డీఎంకే నాయకులు తమ ట్వీట్లను మోడీకి ట్యాగ్ చేస్తున్నారు. ధర్మపురి నుంచి తిరువణ్ణమలై వరకు, కాంచీపురం నుంచి కృష్ణగిరి వరకు ఇదే తీరులో రాష్ట్రంలో డీఎంకే నాయకుల ట్వీట్లు కనిపించాయి. ఈ ట్రెండ్‌ను తొలుత డీఎంకే వాతావరణ విభాగం సెక్రెటరీ కార్తికేయ శివసేనాపతి బుధవారం ప్రారంభించారు. అనంతరం డీఎంకే నాయకులు తాంబరం ఎమ్మెల్యే ఎస్ఎం రాజా, ఈవీ వేలు, అంబేత్ కుమార్, ఏ. మహారాజన్, అనితా రాధాకృష్ణన్, వై. ప్రకాశ్ లతో పాటు పలువురు ఇవే ట్వీట్లను మోడీకి ట్యాగ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు, శ్రీపెరుంబుదుర్ అభ్యర్థి కూడా ఇదే ట్వీట్ చేయడం గమనార్హం.
'వారు అధికారంలోకి వస్తే తమిళనాడు ఫర్ సేల్'
రాష్ట్రంలో పోలింగ్ దగ్గరపడుతున్న తరుణంలో డీఎంకే ప్రచారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నది. రాష్ట్రంలో ఏఐఏడీఎంకే కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మోడీ చేతిలో తోలు బొమ్మ అవుతారనీ, నీట్ పరీక్షను ఎల్కేజీ విద్యార్థులకు కూడా అమలు చేస్తారనీ, తమిళనాడు పేరును 'దక్షిణ ప్రదేశ్'గా మారుస్తారనీ, రాష్ట్రంలో తమిళులకే స్థానం లేకుండా చేస్తారనీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడును అమ్మేస్తారని వివరిస్తూ తన సొంత వార్తపత్రికలో డీఎంకే ఒక ఫుల్‌పేజ్ ప్రకటనను ఇచ్చింది.