Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ ప్రాజెక్ట్ కోసం బలవంతంగా భూసేకరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- దినసరి కూలీలుగా మారిన వేలాదిమంది బాధిత రైతులు
- చట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయంపై కాలుష్య ప్రభావం
న్యూఢిల్లీ : గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపిందో తెలియదుగానీ, వేలాది రైతుల జీవితాల్ని మాత్రం చీకటిమయంగా మార్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం బీజేపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ వేలాది రైతు కుటుంబాల జీవితాల్ని తలకిందులు చేసింది. దాదాపు 12 గ్రామాలకు చెందిన 3377 ఎకరాల భూమిని 'గుజరాత్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్' (జీపీసీఎల్) కోసం రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సేకరించింది. రైతుల నుంచి తీసుకున్న భూమి చుట్టూ జీపీసీఎల్ ఇనుపకంచె వేసి అక్కడికి ఎవర్నీ రానీయటం లేదు. దాంతో భూమి కోల్పోయిన రైతులు, వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. భావ్‌నగర్ పట్టణంలో దినసరి కూలి పనిచేసుకొని బతుకు వెళ్లదీస్తున్నారు.
''42 బిగాల (26 ఎకరాలు) వ్యవసాయ భూమిపై 12మంది కుటుంబ సభ్యులు ఆధారపడి బతుకుతున్నాం. ఆ భూమిని ప్రాజెక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. ఇప్పుడు చేసేందుకు పనిలేక భావ్‌నగర్‌లో దినసరి కూలి పనికి వెళ్తున్నాం. భవన నిర్మాణ కార్మికుడిగా, మ్యాన్‌హోల్స్ తవ్వే కార్మికుడిగా చేస్తున్నాం. రోజంతా పనిచేసినా రూ.250 మించి రావటం లేదు. మా కుటుంబ పోషణకు ఈ ఆదాయం ఏమాత్రమూ సరిపోవటం లేదు. కుటుంబ సభ్యుల్లో మిగతావారూ నగరంలో కూలి పని చేసుకుంటున్నారు'' అని రాన్పూర్ గ్రామానికి చెందిన చాందూభారు సోలంకి గోడు వెళ్లబోసుకున్నారు.
విద్యుత్ ప్రాజెక్ట్ కింద భూమిని కోల్పోయిన వేలాది మంది రైతులు కూడా చాందూభారు సోలంకిలాగే దిక్యూమొక్కూ లేని విధంగా బతుకు వెళ్లదీస్తున్నారు. ఈ విద్యుత్ ప్రాజెక్ట్ కోసం 12 గ్రామాల నుంచి భూమిని సేకరించారు. ఇదంతా కూడా భావ్‌నగర్ తాలూకా కిందకు వస్తుంది. తక్కువరకం బొగ్గును కలిగివుండే లిగ్నైట్ నిక్షేపాలున్నాయని ఈ భూమిని ప్రాజెక్ట్‌కు ఎంపికచేశారు. ఓపెన్ కాస్ట్ బొగ్గు తవ్వకం వల్ల ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న వేడిమి, ధూళి, బూడిద..చుట్టుపక్కల వందలాది గ్రామాల్ని ముంచెత్తుతోంది.
ప్రాజెక్ట్‌కు సమీపంగా ఉన్న వ్యవసాయ భూముల్లోకి అక్కడి రైతులను కూడా రానివ్వటం లేదు. అనధికారికంగా రైతుల నుంచి భూమిని సేకరిస్తున్నారు. ఏదో ఒకరోజు మీ భూమి తీసేసుకుంటాం, ఇంతలో అమ్మేస్తే మీకే లాభమని బెదిరిస్తున్నారు. '' భూసేకరణలో కొంత పోయినా, మరికొంత ఉందని సంతోషించా. కానీ మైనింగ్ సైట్ నుంచి 500మీటర్ల దూరంలోనే నా భూమి ఉంది. ఇందులో ఏ పంటల్నీ సాగు చేయలేకపోతున్నాం. ఏదో ఒక రోజు భూమిని అమ్ముకొని వెళ్లిపోవటం జరుగుతుందని భయపడుతున్నా. ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయి రోడ్డునపడ్డారు. పంటల్లేవు. పనుల్లేవు'' అని బాడీ గ్రామానికి చెందిన కంటారియా ఆవేదన వ్యక్తంచేశారు.