Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో 6న ఎన్నికలు
చెన్నై/తిరువనంతపురం : కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో(ఆదివారం) తెరపడనుంది. సాయంత్రం 6 గంటలతో మైకులు మూగబోనున్నాయి. ఈ అసెంబ్లీలకు ఈనెల 6న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ సేతృత్వంలోని యూడీఎఫ్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. దక్షిణాదిలోని మరో కీలక రాష్ట్రం 234 స్థానాలున్న తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే పోటీ నెలకొంది. కరుణానిధి, జయలలిత వంటి ఇద్దరు హేమాహేమీలు లేకుండా జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయమ్ ప్రవేశించినప్పటికీ దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 126 సీట్లున్న అసోంలో కాంగ్రెస్ నేతృత్వంలోని పది పార్టీల కూటమికి, బీజేపీ నేతృత్వంలోని కూటమికి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 30 స్థానాలున్న పుదుచ్చేరిలో కాంగ్రెస్, బీజేపీ కూటములే ప్రధానంగా తలపడుతున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో ఏప్రిల్6న ఎన్నికలు నిర్వహిస్తుండగా, మూడు విడతలుగా సాగుతున్న అస్సాంలో తుది విడత పోలింగ్ వీటితోబాటే జరుగుతోంది. 8 విడతలుగా సాగుతున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో విడతగా 31 స్థానాలకు మంగళవారం నాడే పోలింగ్ జరగనుంది.
కన్నూర్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేరళ సీఎం, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్ మాట్లాడుతూ ప్రధాని మోడీతో పాటు ఇతర బీజేపీ నేతలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కేరళ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 ఎన్నికల ప్రచార సమయంలో మోడీ కేరళను సోమాలియాతో పోల్చిన విషయాన్ని విజయన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధికి ఎల్డీఎఫ్కు మరో అవకాశం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు. వేదారణ్యం పట్టణంలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న డీఎంకే అధినేత స్టాలిన్ ప్రధాని మోడీ, సీఎం పళనిస్వామి తీరుపై విరుచుకుపడ్డారు. కన్యాకుమారిలో జిల్లాలోని ఎనాయం వద్ద ఏర్పాటు చేయదలచుకున్న పోర్టు విషయంలో ఇద్దరు మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీ, అధికార అన్నాడీఎంకేలకు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి, సినీ నటి ఖుష్బూ తరపున తేనాంపేటలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు.