Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో 81శాతం కోవిడ్..19 నమోదు
- ఒక్కరోజులో అక్కడ మరణాలు 481
- 8 రాష్ట్రాల్లో వైరస్ ఉధృతి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య పూర్వపు భయాల్ని రేపుతోంది. శనివారం ఒక్కరోజే దేశంలో 89,129 కొత్త కేసులు నమోదవ్వటంతో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సెప్టెంబరు 20 తర్వాత గరిష్ట స్థాయిలో కేసులు నమోదుకావటం ఇదే మొదటిసారి. 89 వేల కొత్త కేసుల్లో 81శాతం ఒక్క మహారాష్ట్రలో నమోదుకాగా, మిగతావి మరో 7 రాష్ట్రాల్లో బయటపడ్డాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కి చేరుకుంది. ఇందులో 1,15,69,241 రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాబారిన పడి మరణించినవారి సంఖ్య 1,64,110గా ఉంది. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 6,58,909కి పెరిగింది. వీటిలో 3.91లక్షల కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోజుకు సగటున 10వేలు కరోనా కొత్త కేసులు నమోదుకాగా, ఆ సంఖ్య ఇప్పుడు (ఏప్రిల్) 60 వేలు దాటింది.
ఆ 8 రాష్ట్రాల్లో అత్యధికం
ఫిబ్రవరి నాటికి మహారాష్ట్రంలో 42,830 క్రియాశీల కేసులు ఉండగా, ఏప్రిల్ 3నాటికి కేసుల సంఖ్య తొమ్మిది రేట్లు పెరిగింది. అలాగే కర్నాటకలో ఆరు రేట్లు, ఛత్తీస్గఢ్లో 8రేట్లు, పంజాబ్లో 12రేట్లు, ఢిల్లీలో 10రేట్లు ఎగబాకాయి. మరోవైపు క్రీయాశీల కేసుల్లో 77శాతం మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్గఢ్, కేరళ, పంజాబ్లలో ఉన్నాయి. రోజువారీగా కొత్త కేసుల నమోదు అనూహ్యంగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త కేసుల నమోదు ఎక్కువగా ఉందని తెలిపారు. దేశంలోని కరోనా సోకినవారితో పోల్చితే, యాక్టీవ్ కేసులు 5.32శాతంగా ఉందని, అదే రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో 59.36శాతముందని కేంద్రం పేర్కొంది.
పరిస్థితి ఆందోళకరం : రాజీవ్ గౌబా
ఒక రోజు కరోనా మరణాల విషయానికొస్తే, మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్..ఈ ఐదు రాష్ట్రాల్లో 85.85శాతం మరణాలు చోటుచేసుకున్నాయి. ఒక్క రోజులో అత్యధికంగా మహారాష్ట్రలో 481మంది, పంజాబ్లో 57మంది కరోనా కారణంగా చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు చోటుచేసుకోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులకు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలియజేశారు. భౌతిక దూరం, మాస్కులు ధరించటం..వంటి జాగ్రత్తలు ప్రజలు పాటించేలా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని రాజీవ్ గౌబా కోరారు. కరోనా రోగుల ఐసోలేషన్, ట్రేసింగ్ పకడ్బంధీగా ఉండాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు.