Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలకిందులైన కుటుంబాల బడ్జెట్
- మండుతున్న నిత్యావసరాల ధరలు
- పడిపోయిన పొదుపు సామర్థ్యం
- పెట్రో ధరలపై అసహనం
- మోడీ విధానాలతో ధరలకు ఆజ్యం : ప్రజాసంఘాలు
ఆదాయలు పెరగటంలేదు.. కానీ, నిత్యావసరాల ధరలు మాత్రం సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదని సగటుజీవి అనుకుంటున్న మాటలివి. మోడీ ప్రభుత్వం ఇంధన ధరలు, గ్యాస్ ధరల్ని బాదేస్తుంటే.. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. దీనికి తోడుగా కరోనా మహమ్మారి రెండో విడత కోరలు విప్పుతుంటే.. సరైన ఉపాధిలేక కోట్లాది కుటుంబాల బడ్జెట్ తారుమారైంది. ఓ వైపు దిగజారిన పొదుపు.. మరోవైపు ఎగబాకుతున్న ధరలతో బతుకుకు తంటగా మారిందని ప్రతిఒక్కరిలోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది.
న్యూఢిల్లీ : దేశంలో నెలకొన్న అధిక ధరలు కుటుంబాల బడ్జెట్‌ను తారుమారు చేస్తున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం నిత్యావసరాలపై పడింది. అమాంతంగా పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని.. పలువురి అభిప్రాయాలతో టైమ్స్ ఓ కథనం వెల్లడించింది. ఇప్పటికే కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌తో అనేకమంది ఉద్యోగాలు కోల్పోవడం, ఉన్న సిబ్బంది వేతనాల్లోనూ కోతలు, ఇతర ఆదాయాల్లోనూ తగ్గుదలవల్ల అనేక కుటుంబాలు తీవ్ర భారాన్ని ఎదుర్కోవడంతో పాటుగా అప్పుల పాలవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ విధానాలు ధరలకు మరింత ఆజ్యం పోశాయి. ముఖ్యంగా భారీగా పెరిగిన చమురుపై అనేక మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికార గణంకాల ప్రకారం.. గడిచిన ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచి 5 శాతానికి ఎగిసి మూడు మాసాల గరిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. మరోవైపు టోకు ద్రవ్యోల్బణం సూచి 4.2 శాతంగా నమోదై.. ఏకంగా 27 మాసాల గరిష్ట స్థాయికి ఎగిసింది. ముఖ్యంగా ఇంధన, అహార, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడం వల్లే ద్రవ్యోల్బణం పెరిగిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇటీవల తన గణంకాల్లో తెలిపింది. అధిక ధరలు పెద్ద సమస్యగా మారాయని కోల్‌కతా కేంద్రంగా పని చేస్తోన్న పరమిత బిస్వాస్ పేర్కొన్నారు. కరోన నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సానిటైజర్లు, మాస్కులు కొనుగోలు చేయడం కూడా భారమైందని ఆమె తెలిపారు. ఫిబ్రవరిలో చేపల ధరలు ఏకంగా 11.3 శాతం, గుడ్ల ధరలు 11.1 శాతం ప్రియమయ్యాయి. వంట నూనెల ధరలు 20.8 శాతం, పప్పులు 12.3 శాతం చొప్పున ఎగిశాయి. గతేడాది ఏప్రిల్‌లో ఢిల్లీలో కిలో కంది పప్పు ధర రూ.95గా ఉండగా.. ప్రస్తుతం రూ.108కి చేరింది. గతేడాది హైదరాబాద్‌లో లీటర్ వంట నూనె ధర రూ.114గా ఉండగా.. ఇప్పుడిది రూ.155కు ఎగిసింది. కోల్‌కతాలో ఏకంగా రూ.179కి చేరింది.
దేశంలో విపరీతంగా పెరిగిన చమురు ధరలు తమ నెలసరి బడ్జెట్‌ను దెబ్బతీశాయని బెంగళూరులోని ఐటీ ఉద్యోగి చిన్మయి బరిక్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ పొదుపు స్థాయి పడిపోయిందని తెలిపారు. ఆన్లైన్లో ఆహారోత్పత్తుల ఆర్డర్ ధరలు పెరిగాయన్నారు. ఇతర ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో బయట అహార ఉత్పత్తులు తినడం తగ్గించుకున్నామన్నారు. ఆదాయాలు తగ్గడం, ఉద్యోగాలు పోవడంతో తమ కాంప్లెక్స్‌లో అద్దెకు ఉండే అనేక మంది నివాసాలను ఖాళీచేసి వెళ్లిపోయారని ముంబయిలోని ఓ బ్యాంక్ ఉద్యోగి రాజీవ్ భన్సల్ తెలిపారు. ఇటీవల కాలంలో పండ్లు, కూరగాయల ధరలు అమాంతం పెరిగాయని చెన్నైలో వాసి సుమతి జరుకుమార్ తెలిపారు. అధిక ధరల నేపథ్యంలో తమ వ్యయాలను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు.