Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటల్లో 93 వేల కేసులు
- మహారాష్ట్రలో రాత్రి పూట కర్ఫ్యూ
- పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం వేలల్లో నమోదవుతున్న కొత్త కేసులు క్రమంగా లక్షకు చేరువగా పరుగులు పెడుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు, మరణాలు సైతం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24గంటల్లో కొత్తగా 93,249 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, 513 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,85,509కి, మరణాల సంఖ్య 1,64,623కు పెరిగింది. కొత్తగా 60,048మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 1,16,29,289కి చేరింది. ప్రస్తుతం 6,91,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. గత 24గంటల్లో 27.38లక్షల మందికి టీకా వేయగా మొత్తంగా 7,59,79,651 మందికి వాక్సిన్ ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. అయితే, దేశంలో నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని కేంద్రం తెలిపింది.
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు
మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతు న్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. శనివారం ఒక్కరోజే దాదాపు 49,447 కేసులు, 277మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 37,821 మంది కోలుకున్నారు. మహా రాష్ట్రలో ఇప్ప టి వరకు 29.53లక్షల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 24.95లక్షల మంది కోలుకోగా.. 55,656 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 4.02లక్షల యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రం మొత్తం రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. తాజా ఆంక్షలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇక వచ్చే శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు(మూడు రోజులు) పూర్తి లాక్డౌన్ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది.
కర్నాటకలో థియేటర్లలో 50 శాతం సీట్లకే అనుమతి
కరోనా ఉధృతి నేపథ్యంలో సినిమా థియేటర్ల సీట్ల పరిమితిపై కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో సీట్ల పరిమితిని 50 శాతానికి కుదిస్తూ ఆదేశాలిచ్చింది. ఏప్రిల్ 7 నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఆన్ లైన్లో టికెట్లు రిజర్వు చేసుకొన్న వినియోగదారులు నష్టపోతారంటూ కన్నడ సినీ పరిశ్రమ ముఖ్య మంత్రికి విజ్ఞప్తి చేయడంతో.. ఈ ఆదేశాల అమలు తేదీని సవరించినట్టు ప్రభుత్వం తెలిపింది.
జమ్మూకాశ్మీర్‌లో పాఠశాలలు బంద్
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు మూసివేయాలని నిర్ణయిం చింది. విద్యార్థుల, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 5 నుంచి 18 వరకూ పాఠశాలలు, ఒక వారం పాటు 10 నుంచి 12 భౌతిక తరగతులు నిలిపేస్తున్నట్టు ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ మనో జ్ సిన్హా కార్యాలయం ట్విటర్ ద్వారా వెల్లడించింది.
కనిమొళికి కరోనా..
డీఎంకే నేత, ఎంపీ కనిమొళి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే స్వీయ నిర్బంధం లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఇక తమిళనాడులో వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉంది.
ఐఐటీ జోధ్‌పూర్‌లో 52 మందికి కరోనా
ఐఐటీ జోధ్‌పూర్‌లో 52 మందికి విద్యార్థులు కరోనా బారినపడ్డారు. వీరిలో అత్యధికం గుజరాత్, ఒడిశాకు చెందిన విద్యార్థులు ఉన్నారని అధికారులు తెలిపారు. విద్యార్థులు తిరిగి ప్రాక్టికల్ క్లాసులకు హాజరయ్యేందుకు వచ్చిన నేపథ్యంలోనే వారు కరోనా బారినపడ్డారు.