Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి
- ఇదే ట్రెండ్ కొనసాగితే బ్రెజిల్‌ను భారత్ అధిగమిస్తుంది : ఆరోగ్య నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. ప్రస్తుతం 'సెకండ్ వేవ్'తో పోరాడుతున్న భారత్‌లో కరోనా కేసులు లక్ష మార్కును దాటాయి. భారత్‌లో 24 గంటల్లో రికార్డుస్థాయిలో లక్షకు పైగా కేసులు నమోదుకావడం ఆందోళనను కలిగిస్తున్నది. గతేడాది జనవరి 30న దేశంలో కరోనా తొలి కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షమార్కును దాటలేదు. ఆ ఏడాది సెప్టెంబర్‌లో దేశంలో కరోనా కేసులు లక్ష మార్కుకు దగ్గరై తొలిసారి పీక్ స్టేజ్‌కు చేరుకున్నది. ఆ తర్వాత అక్టోబర్ నుంచి దేశంలో కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. నెల క్రితం వరకు రోజుకు 10-20వేల మధ్య కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే, కొన్ని రోజుల వ్యవధిలోనే కేసులు అమాంతంగా పెరిగి లక్షకు పైగా చేరుకోవడం దేశంలో పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. దేశంలో సోమవారం (ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు) 1.03 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1.25 కోట్లకు పైగా చేరుకొని బ్రెజిల్ (ఇక్కడ 1.30 కోట్లకు పైగా కేసులు ఉన్నాయి) తర్వాత రెండో స్థానంలో ఉన్నది. కాగా, యూఎస్ తర్వాత ఒక్క రోజులో లక్షకు పైగా కరోనా కేసులు నమోదైన దేశంగా భారత్ ఉన్నది. అత్యధిక కేసులున్న బ్రెజిల్‌లోనూ 24 గంటల్లో లక్షకు పైగా కేసులు నమోదు కాలేదు. అక్కడ గతనెలలో అత్యధికంగా 80వేలకు పైగా మాత్రమే కరోనా కొత్త కేసులు వచ్చాయి. అయితే, దేశంలో కరోనా కేసుల నమోదు ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే.. భారత్ ఈ వారంలోనే బ్రెజిల్‌ను అధిగమించే ప్రమాదమున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వైరస్ భారిన పడి తాజాగా 478 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,65,101కు చేరుకున్నది. దేశంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తున్నప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉండటం, రికవరీ రేటు అధికంగా ఉండటం కాస్త ఊరటను కలిగిస్తున్నది. దేశంలో ఇప్పటి వరకు 1.16 కోట్ల మందికి పైగా కరోనాను జయించారు. ప్రస్తుతం దేశంలో 7,41,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి.