Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగిలిన 25 శాతం వాటా స్వాధీనం
న్యూఢిల్లీ : పాలకుల మద్దతుతో అదానీ గ్రూపు ఏకస్వామ్యంగా నౌకాశ్రయాల స్వాధీన పరంపరను కొనసాగిస్తోంది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) తాజాగా కృష్ణపట్నం పోర్టులోని మిగితా వాటాలను స్వాధీనం చేసుకుంది. గతేడాది కష్ణపట్నం పోర్టులోని 75 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు .. మిగిలిన విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటాను రూ.2,800 కోట్లకు స్వాధీనం చేసుకుంది. దీంతో ఇందులోని 100 శాతం వాటాలు అదానీ గ్రూపు హస్తగతమయ్యాయి. తాజా ఒప్పందంతో ఈ నౌకాశ్రయ యాజమాన్య హక్కులు పూర్తిగా తమకు బదలాయింపు కానున్నాయని ఆ కంపెనీ సోమవారం వెల్లడించింది. గతేడాది ఈ పోర్టులోని 75 శాతం వాటాను రూ. 13,675 కోట్లకు కొనుగోలు చేసింది. అత్యంత లోతైన ఈ పోర్టు ప్రస్తుతం ఏడాదికి 64 మిలియన్ టన్నుల సరుకు రవాణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. నీటిలో 20 కిలోమీటర్లు, 6800 ఎకరాల భూభాగంతో విస్తరించి ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 38 మిలియన్ టన్నుల సరుకు రవాణతో రూ.1,840 కోట్ల రెవెన్యూతో రూ.1,325 కోట్ల లాభాలు ఆర్జించినట్లు ప్రాథమిక గణంకాల అంచనా. సరకు రవాణా సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా 2025 నాటికి పోర్టు సామర్థ్యాన్ని 500 మిలియన్ టన్నులకు చేర్చడానికి ప్రయత్నిస్తామని ఏపీఎస్ఈజెడ్ సీఈఓ కరన్ అదానీ తెలిపారు. బహుళ రకాల సరుకు రవాణకు వీలుగా రూపకల్పన చేస్తామన్నారు. 2025 నాటికి పోర్టు ఆదాయాలను రెట్టింపు చేయాలని నిర్దేశించుకున్నామన్నారు. ఈ పోర్టును గేట్‌వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తామన్నారు. ఇక్కడి పోర్టు భూభాగాన్ని తయారీ, పారిశ్రామిక హబ్‌గా మారుస్తామన్నారు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ గ్రూపునకు విమానయాన, నౌకాయాన రంగాల్లోని వ్యాపారాలను పట్టంకడుతుందనే ఆరోపణలు తీవ్రం అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే గంగవరం పోర్టు లిమిటెడ్ (జీపీఎల్)లోని కేవలం 11 శాతం మినహా మిగితా 89.6 శాతం వాటాను రూ.5,558 కోట్లతో కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు స్వాధీనాలతో అదానీ గ్రూపు తూర్పు తీరంపై, ముఖ్యంగా రాష్ట్ర సముద్రతీరంలో ఆధిపత్యాన్ని భారీగా పెంచుకున్నట్లయింది. దేశంలోని నౌకాయాన రంగంలో 30 శాతం పైగా మార్కెట్ వాటా అదానీ చేతిలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఈ రంగంలో ఏకచత్రాదిపత్యం వహిస్తుందనే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది.