Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడునెలల కనిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి
- ఉద్యోగాలపై తీవ్రప్రభావం : ఐహెచ్ఎస్ మార్కిట్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభించడంతో తయారీ రంగ కార్యకలాపాలు ఏడు నెలల కనిష్టానికి పడిపోయాయని ఓ ప్రయివేటు సర్వే అంచనా వేసింది. ఈ ఏడాది మార్చిలో డిమాండ్ క్షీణించడంతో పారిశ్రామిక ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం పడిందని ఐహెచ్ఎస్ మార్కెట్ నెలవారీ సర్వేలో తెలిపింది. 2021 ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ సూచీ (పీఎంఐ) 57.57గా ఉండగా.. గడిచిన మార్చిలో ఇది 55.4కు తగ్గింది. సాధారణంగా పీఎంఐ సూచీ
50 ఎగువన నమోదైతే వద్ధిలో ఉన్నట్టు.. అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లుగా పరిగణిస్తారు. మార్చిలో కొంత ఆశాజనకంగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో సవాళ్లు ఎదురుకావొచ్చని ఈ రిపోర్ట్ పేర్కొంది. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడంతో గడిచిన మార్చిలో కొత్త ఆర్డర్లు తగ్గాయనీ, దీంతో తయారీ సైతం నెమ్మదించిందని ఐహెచ్ఎస్ మార్కెట్ ప్రతినిధి లిమా తెలిపారు. ఈ నేపథ్యంలో తయారీ కార్యకలాపాలతో పాటు కొనుగోళ్లు కూడా తగ్గాయన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైన కఠిన ఆంక్షల విధింపు నేపథ్యంలో పరిశ్రమలకు ఏప్రిల్ మాసం సవాళ్లతో కూడుకుందన్నారు. ఉద్యోగ కల్పనపై కరోనా ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.