Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయిలో లాక్డౌన్ భయం...
ముంబయి : దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరాన్ని కరోనా వైరస్ మరోసారి వణికిస్తున్నది. దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో బతుకీడుస్తున్న వలస కార్మికులు, కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే చాలా మంది కార్మికులకు రోజువారీ జీతం మీద ఆధారపడేవారే. కష్టపడి పనిచేస్తేగానీ పూటగడవని పరిస్థితి వారిది. రెండోసారి లాక్డౌన్ విధిస్తారన్న ఆందోళనతో వారు నగరం నుంచి గ్రామాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. పెట్టే బేడ, పిల్లా పాపలతో దొరికిన వాహనంలో బయలుదేరుతున్నారు. ఫిబ్రవరితో పోలిస్తే కేసుల సంఖ్య 400శాతం పెరిగాయి. ఓ నివేదిక ప్రకారం ముంబయిలో దాదాపు 30 లక్షల మంది వలస కార్మికులు ఉన్నట్టు అంచనా. కాగా, ఇక్కడ ప్రస్తుతం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజల్లో మార్పు రావాలనీ, లేని పక్షంలో మరోసారి లాక్డౌన్ విధించక తప్పదని ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది. దీంతో లాక్డౌన్ విధిస్తే తమకు ఉపాధి లభించకపోవచ్చని ఆందోళనతో అనేక మంది పేదలు, కూలీలు, కార్మికులు, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారు స్వగ్రామాలకు వెళ్లిపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఒకవేళ మళ్లీ లాక్డౌన్ విధిస్తే ఇక్కడ ఆకలితో అలమటిస్తామన్న భయం వారిని వెన్నాడుతున్నది. దీంతో చాలామంది స్వగ్రామాలకు పయనమవుతున్నారు. ముంబయికి వలస కార్మికులే అతిపెద్ద వనరు. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ. ఆదివారం రాత్రి నుంచి కర్ఫ్యూ ప్రకటించటంతో కార్మికులు గ్రామ బాట మరింత పెరిగినట్టు సమాచారం.
వాహనాల కోసం పడిగాపులు
ముంబయి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు, హైవేలపై
ట్రక్కులు, టెంపోలు, ప్రైవేటు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు అన్నీ స్వగ్రామాలకు వెళ్లే కూలీలు, కార్మికులతో నిండిపోతున్నాయి. కొందరైతే ఎలాగైనా ఇంటికి వెళ్లాలని కార్మికులు క్యూలు కడుతుంటే.. ఇదే అదునుగా కొందరు చార్జీలు కూడా భారీగా పెంచుతున్నారు. ఇంకా కొందరు దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు తమ ప్రాంతానికి వెళ్లే వాహనాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వడిగాపులు కాస్తున్నారు. మరికొందరు ఎక్స్ ప్రెస్, మెయిల్రైళ్లలోనైనా వెళ్లిపోయేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.