Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఐదు రాష్ట్రాల్లో పోలింగ్
- కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు బెంగాల్, అసోంలో మూడో విడత
- అందరి చూపు ఓటరు వైపే
న్యూఢిల్లీ : యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న కేరళ, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు, పశ్చిమబెంగాల్, అసోంలో మూడో విడత ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి. మూడో విడతలో బెంగాల్లో 31 అసెంబ్లీ స్థానాలకు, అసోంలో 40 సీట్లకు మంగళవారం పోలింగ్ జరుగుతున్నది. అసోంలో ఇదే చివరి విడత కాగా, బెంగాల్లో మరో ఐదు విడతల్లో పోలింగ్ జరగనున్నది.
తమిళనాడు
తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. అన్నాడీఎంకే బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. మరోవైపు గత పదేండ్లుగా విపక్షానికి పరిమితమైన డీఎంకే ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి డీఎంకే ఈ ఎన్నికల్లో దిగింది. మరోవైపు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయం నేతృత్వంలో కూటమి పోటీలోకి దిగింది. తమిళనాడు శాసనసభలోని 234 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 3,998 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
కేరళ
కేరళలో మొత్తం అసెంబ్లీ సీట్లు 140 వుండగా.. అధికార లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) చరిత్ర సృష్టించున్నట్టు ఇప్పటికే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కేరళలో తాము చేసిన అభివృద్ది, ప్రజా సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఎల్డీఎఫ్ ధీమా వ్యక్తం చేస్తున్నది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 140 స్థానాలలో ఎల్డీఎఫ్ 91 సీట్లను గెల్చుకున్నది. యూడీఎఫ్‌కు 47 స్థానాలు లభించగా, ఎన్డీయేకు ఒక్క సీటు మాత్రమే దక్కింది. మరోస్థానం ఇండిపెండెంట్ వశమైంది.
పుదుచ్చేరి
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇక్కడ ఓకే విడతలో పోలింగ్ జరుగుతున్నది. ఇటీవల అంతర్గత కుమ్ములాటలతో సీఎం నారాయణస్వామి నేతత్వంలోని కాంగ్రెస్ సర్కార్ పతనమైన విషయం తెలిసిందే. కాగా, డీఎంకేతో పొత్తు కారణంగా తమదే విజయమని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.