Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్‌సీఐ గోడౌన్ల ముందు ఆందోళనలు
- దేశవ్యాప్తంగా ఆగని అన్నదాతల పోరు
- గుజరాత్ రోడ్లన్ని ట్రాక్టర్లతో దిగ్బంధిస్తాం! : రాకేశ్ తికాయత్
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
మోడీ సర్కారు అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన సాగు వ్యతిరేక చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు సోమవారం చేపట్టిన ఆందోళన పెద్ద ఎత్తున జరిగింది. రైతాంగ ఉద్యమం 130 రోజుకు చేరుకున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఇచ్చిన పిలుపులో భాగంగా అన్నదాతలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) బచావ్ కార్యక్రమం విజయవంతంగా సాగింది. దేశంలోని ఎఫ్‌సీఐ కార్యాలయాలు, గోడౌన్ల ముందు రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపినట్టు ఎస్కేఎం సమన్వయకర్త దర్శన్ పాల్ వెల్లడించారు. కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ మంత్రికి భారీ స్థాయిలో వినతి పత్రాలు పంపించారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, హర్యాలో ఖైతల్, గుర్గావ్, రోహతక్, ఫతేబాద్, సోన్‌పేట్, అంబాలా, కర్నాల్, బడోవాల్ బౌక్ తదితర ప్రాంతాల్లో రైతులు ఘెరావ్ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని
అత్రౌలి, అలీగఢ్, అయోధ్య, అలహాబాద్, బీహార్‌లోని సితామర్హి ఎఫ్‌సీఐ గోడౌన్ల ముందు నిరసన తెలిపారు.
రాజస్థాన్‌లో శ్రీగంగనగర్, నాగౌర్, స్వావాయి మాదోపూర్, పంజాబ్‌లోని భవానీగఢ్, సునాం, బర్నాలా, సంగ్రూర్, జలంధర్, గుర్దాస్పూర్, మాన్సా, అమత్సర్తో పాటు సుమారు 60 ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. కరోనా నిబంధనలు పాటిస్తూనే రైతులంగా నిరసన తెలిపారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ నల్లచట్టాలను చట్టాలు దేశంలోని ప్రజా పంపిణీ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేస్తాయని రైతు నేతలు విమర్శించారు. దేశంలోని పీడీఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సి ఉండగా ఆ విషయాన్ని పక్కనబెట్టి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను బలహీనం చేస్తుందని విమర్శించారు. అందుకే.. దేశవ్యాప్తంగా రైతులంతా ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. రైతు ఉద్యమ కేంద్రమైన ఘాజీపూర్‌లో అలహాబాద్ లాయర్లు అన్నదాతల ఆందోళనలపై ప్రత్యేక బుక్లెట్ విడుదల చేశారు. రైతు వ్యతిరేక చట్టాలతో అన్నదాతలకు జరిగే నష్టాన్ని అంచనా వేస్తూ ఈ పుస్తకాన్ని అక్షరీకరించినట్టు చెప్పారు. వారంతా రచించిన వేలాది బుక్లెట్లను రైతులకు పంచిపెట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రైతులంతా మిట్టి సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించినట్టు వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 150 గ్రామాల నుంచి మట్టిని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమ కేంద్రానికి తీసుకురానున్నట్టు వివరించారు. ఈ మట్టితో రైతు ఉద్యమంలో అమరులైన వారందరికీ స్మారక స్థూపం నిర్మిస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న మిట్టి సత్యాగ్రహం మంగళవారంతో సింఘుకు చేరుకోనున్నది.
'దిగ్బంధిస్తాం'
గుజరాత్ రాజధాని గాంధీ నగర్ రోడ్లన్నీ రైతన్నల ట్రాక్టర్లతో దిగ్బంధిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. అందుకు సమయం కూడా ఆసన్నమైందన్నారు. సాగు చట్టాలపై మోడీ సర్కారు వెనక్కు తగ్గకపోతే ఈ ఆందోళన తప్పక నిర్వహిస్తామన్నారు. గుజరాత్లో తికాయత్ సోమవారం పర్యటించారు. ఈ రాష్ట్రంలో మిట్టి సత్యాగ్రహం పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. రైతులంతా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని వివరించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గుజరాత్లో బార్డోలీ ప్రాంతంలో ఉద్యమం జరిగినట్టు ప్రస్తుత రైతాంగ పోరాటం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.