Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ
- 8న ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్ ఉధృతితో కోవిడ్-19 బారినపడుతున్న వారితో పాటు మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 96,982 మందికి కరోనా సోకింది. 446 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కి చేరగా, మరణాల సంఖ్య 1,65,547కు పెరిగింది. ప్రస్తుతం 7,88,223 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 50,143 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 1,17,32,279కి పెరిగింది. కరోనా ఉధృతి నేపథ్యంలో కరోనా పరీక్షలతో పాటు టీకా డ్రైవ్‌ను అధికారులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 12.11 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ తెలిపింది. మొత్తంగా 25.02 కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్టు వెల్లడించింది. కాగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 8,31,10,926 కరోనా డోసులను పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.
మహారాష్ట్రలో మహమ్మారి ఉధృతి
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 47,288 మహారాష్ట్రలోనే వెలుగుచూశాయి. దాదాపు 49 శాతం ఇది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 7,302, కర్నాటకలో 5,279 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, దేశంలోని యాక్టివ్ కేసుల్లో 58 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, పంజాబ్, కర్నాటక, ఢిల్లీలో నమోదవు తున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆర్టీ-పీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాల్సిందిగా తాము రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామని స్పష్టం చేశారు. రానున్న రోజులు వైరస్ కట్టడికి అత్యంత కీలకమని తెలిపారు.
ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ
దేశరాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నామని ప్రకటించింది. ఈ నెల 6 నుంచి 30వవరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. కాగా, ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో కరోనా నాల్గో వేవ్ కొనసాగుతుందని తెలిపారు. లాక్డౌన్ మాత్రం పరిష్కారం కాదనీ ఆయన పేర్కొన్నారు. అయితే, ఎప్పటికప్పుడు కరోనాపై సమీక్షలు నిర్వహిస్తూ.. వైరస్ కట్టడికి మెరుగైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.